టీమిండియావైపే సిడ్నీ పిచ్ మొగ్గు!

25 Mar, 2015 16:58 IST|Sakshi
టీమిండియావైపే సిడ్నీ పిచ్ మొగ్గు!

సిడ్నీ: క్రికెట్ ప్రపంచం చూపంతా సిడ్నీవైపే. ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ విజేత ఎవరు? డిఫెండింగ్ చాంపియన్ టీమిండియానా? ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియానా? ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు కలిసినా ఇదే చర్చ. గురువారం జరిగే ఈ బిగ్ ఫైట్ కోసం భారత్, ఆసీస్ సన్నద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో పిచ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పిచ్ ఆస్ట్రేలియా కంటే టీమిండియాకు ఎక్కువగా అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. సిడ్నీ వికెట్ పేస్ కంటే స్పిన్కు బాగా సహకరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే కంగరూలకు కష్టాలు తప్పవు. ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. టీమిండియాకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ జట్టులో ఈ స్థాయి స్పిన్నర్లు లేరు. ఇరు జట్లకు ఇదే ప్రధానమైన తేడా. సెమీస్లో అశ్విన్, జడేజా బౌలింగ్ కీలకంకానుంది. సిడ్నీ పిచ్ గతంలో కూడా స్పిన్కు సహకరించిన సందర్భాలున్నాయి. ఈ వేదికపై భారత బ్యాట్స్మెన్ రాణించారు. ఈ నేపథ్యంలో అశ్విన్, జడేజా బంతికి పనిచెబితే ఆసీస్ కంగారెత్తిపోవడం ఖాయం. ప్రపంచ కప్లో 12 వికెట్లు తీసిన అశ్విన్పై భారీ అంచనాలున్నాయి. జడేజాతో కలసి అశ్విన్ కంగారూలను కట్టడి చేస్తారని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ వేదికపై దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో వాడిన పిచ్నే ఉపయోగించనున్నారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, డుమినీ కీలక పాత్ర పోషించారు. ఇమ్రాన్ నాలుగు, డుమినీ మూడు వికెట్లు పడగొట్టారు. ప్రపంచ కప్లో భారత్ క్వార్టర్స్తో పాటు ఆరు లీగ్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు  ఏడూ మ్యాచ్ల్లోనూ ఆలౌట్ చేసి మొత్తం 70కి 70 వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్లు రాణిస్తే సిడ్నీలోనూ ఆలౌట్ చేసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు