‘శాస్త్రి, కోహ్లిలకు ఉన్నంత అనుభవం వారికి లేదు’

8 Oct, 2018 20:11 IST|Sakshi

సెలక్టర్లపై సయ్యద్‌ కిర్మాణీ వ్యాఖ్యలు

జట్టు ఎంపిక విషయంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిల నిర్ణయాన్ని సవాలు చేసేంత అనుభవం సెలక్షన్‌ కమిటీకి లేదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సయ్యద్‌ కిర్మాణీ వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా రోహిత్‌ శర్మ, కరుణ్‌ నాయర్‌, మురళీ విజయ్‌లకు జట్టులో చోటు కల్పించకపోవడంతో సెలక్షన్‌ కమిటీపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పు పడుతూ పలువురు సీనియర్‌, మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

తాజాగా ఈ విషయంపై స్పందించిన సయ్యద్‌ కిర్మాణీ... ‘ కోచ్‌గా రవిశాస్త్రే మెయిన్‌ సెలక్టర్‌గా వ్యవహరిస్తాడు. అలాగే కెప్టెన్‌, సీనియర్‌ సభ్యులతో చర్చించిన తర్వాతే సెలక్షన్‌ కమిటీకి తన అభిప్రాయం చెబుతాడు. అయితే ఇప్పుడున్న సెలక్షన్‌ కమిటీ సభ్యులకు ఆటలో శాస్త్రి, కోహ్లిలకు ఉన్నంత అనుభవం లేదు. కాబట్టి జట్టు సభ్యుల ఎంపిక విషయంలో శాస్త్రి, కోహ్లిలతో డిబేట్‌ చేసే అవకాశం వారికి లేదు’ అంటూ వ్యంగ్యంగా వాఖ్యానించాడు. అంతేకాకుండా జట్టులో చోటు దక్కాలంటే ప్రతిభ ఒక్కటే కొలమానం కాదని, అదృష్టం కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. తన కెరీర్‌లో పీక్‌ టైమ్‌లో ఉన్నపుడు కూడా తనకు జట్టులో చోటు దక్కకపోవడమే ఇందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు