మనసు మార్చుకున్న మాజీ క్రికెటర్‌

8 Jan, 2018 20:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: నేత్రదానంపై మాజీ క్రికెటర్‌ సయిద్‌ కిర్మాణీ మనసు మార్చుకున్నారు. మతపరమైన విశ్వాసాల కారణంగా కళ్లు దానం చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. చెన్నైలో శనివారం రోటరీ రాజన్ ఐ బ్యాంక్‌, మద్రాస్‌ రోటరీ క్లబ్‌ నిర్వహించిన కార్యక్రమంలో కిర్మాణీ పాల్గొన్నారు. నేత్రదానం చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని వెనక్కు తీసుకున్నట్టు సోమవారం ప్రకటించారు.

‘నాకు భావోద్వేగాలు, నమ్మకాలు ఎక్కువ. అవయవదానంపై డాక్టర్‌ మోహన్‌ రాజ్‌ చేస్తున్న చైతన్య కార్యక్రమాలు నచ్చి నేత్రదానం చేస్తానని వాగ్దానం చేశాను. మత విశ్వాసాల కారణంగా నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోతున్నాను. కానీ అందరూ కళ్లు దానం చేయాలని కోరుకుంటున్నాన’ని కిర్మాణీ పేర్కొన్నారు.

భారత అంధుల క్రికెట్‌ జట్టుకు అనధికారిక అంబాసిడర్‌గా ఉన్న తాను ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెటర్ల అంకితభావం ఎంతోగానో ఆకట్టుకుందని, అందుకే నేత్రదానానికి ముందుకు వచ్చానని చెప్పారు. అయితే మతవిశ్వాసాల కారణంగా మాటను నిలుపుకోలేకపోతున్నానని కిర్మాణీ వెల్లడించారు.  

>
మరిన్ని వార్తలు