సైనా, కశ్యప్‌ శుభారంభం 

22 Nov, 2018 01:27 IST|Sakshi

రెండో సీడ్‌ ప్రణయ్‌కు షాక్‌

లక్నో: సయ్యద్‌ మోదీ స్మారక వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ సైనా 21–10, 21–10తో కేట్‌ ఫూ కునె (మారిషస్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, మామిళ్లపల్లి తనిష్క్‌ ముందంజ వేయగా... శ్రీకృష్ణప్రియ, గుమ్మడి వృశాలి తొలి రౌండ్‌లో నిష్క్రమించారు. సాయి ఉత్తేజిత 21–19, 21–19తో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్‌)పై, తనిష్క్‌ 21–17, 21–16తో రసిక రాజే (భారత్‌)పై గెలిచారు. వృశాలి 12–21, 9–21తో జాంగ్‌ యిమాన్‌ (చైనా) చేతిలో ఓడిపోగా... ప్రాషి జోషితో జరిగిన మ్యాచ్‌లో 6–3తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా శ్రీకృష్ణప్రియ వైదొలిగింది.  

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పారుపల్లి కశ్యప్‌ 21–14, 21–12తో తనోంగ్‌సక్‌ సెన్‌సోమ్‌బున్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)పై, భమిడిపాటి సాయి ప్రణీత్‌ 21–12, 21–10తో సెర్గీ సిరాంట్‌ (రష్యా)పై, గురుసాయిదత్‌ 21–11, 21–15తో జొనాథన్‌ పెర్సన్‌ (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే రెండో సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (భారత్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రణయ్‌ 14–21, 7–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సిరిల్‌ వర్మ 12–21, 17–21తో సమీర్‌ వర్మ (భారత్‌) చేతిలో, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ 19–21, 21–8, 18–21తో మిలాన్‌ లుడిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) ద్వయం 14–21, 11–21తో రెన్‌ జియాంగ్‌జు–చావోమిన్‌ జౌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.    

మరిన్ని వార్తలు