ఫైనల్‌ : స్మృతి మాత్రమే నిలిచింది.. దాంతో

12 Feb, 2020 13:31 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత క్రికెట్‌ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఇప్పటికే అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో యువ భారత్‌ బోల్తాపడగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసిన మెన్‌ ఇన్‌ బ్లూ జట్టు 0-3 తో కివీస్‌ చేతిలో వైట్‌ వాష్‌ అయింది. ఇక బుధవారం జరిగిన ముక్కోణపు మహిళల టీ20 క్రికెట్‌ టోర్నీ ఫైనల్లో సైతం చేదు ఫలితమే వచ్చింది. ఆస్ట్రేలియతో జరిగిన టోర్నీ తుది పోరులో భారత మహిళల జట్టు 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

తడబడిన భారత్‌..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో భారత్‌ తడబడింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ 10 పరుగులకే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగింది. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం కరువైనా చాలాసేపు ఒంటరి పోరాటం చేసింది. 15వ ఓవర్‌లో స్మృతి ఔటయ్యే వరకు భారత్‌ ఇన్నింగ్స్‌ గెలుపు దిశగానే సాగింది.

ఆ ఓవర్‌లో స్మృతి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరగడంతో టీమిండియా ఏ దశలోనూ తేరుకోలేదు. స్టార్‌ ప్లేయర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (14) కూడా మరుసటి ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అయింది. మిగతా ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో మొత్తం ఓవర్లపాటు బ్యాటింగ్‌  కొనసాగించిన టీమిండియా 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

విజయం ఆమెదే..!
ఆస్ట్రేలియా విజయంలో ప్లేయర్‌ ఆఫ్‌ద మ్యాచ్‌ జెస్‌ జొనాసేన్‌ కీలకపాత్ర పోషించారు. నాలుగు ఓవర్లు వేసిన జొనాసేన్‌ కేవలం 12 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. వ్లామింక్‌ రెండు, ఎలిస్‌ పెరీ, సుతర్లాండ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మూనీ (54 బంతుల్లో 71; 9 ఫోర్లు) రాణించింది. గార్డ్‌నర్‌ (26), లేనింగ్‌ (26), రాచెల్‌ హెయ్‌నస్‌ (18) పరవాలేదనిపించారు. దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌ తలా రెండు వికెట్లు, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి చెరో వికెట్‌ తీశారు. మూనీ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికైంది. 

మరిన్ని వార్తలు