టెస్టులను టి20లు నాశనం చేయడం ఖాయం

11 Jan, 2016 03:30 IST|Sakshi

ఫికా ఆందోళన
మెల్‌బోర్న్: ఐపీఎల్, బిగ్ బాష్ లాంటి టి20 లీగ్‌లు భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు తీరని నష్టాన్ని కలగజేయడం ఖాయమని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘం సమాఖ్య (ఫికా) సీఈవో టోనీ ఐరిష్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే టెస్టు ఫార్మాట్‌లో ఐసీసీ విప్లవాత్మక మార్పులు చేపట్టకపోతే మున్ముందు ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ కనుమరుగైనా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే ప్రస్తుత భవిష్యత్ పర్యటనల కార్యక్రమం 2019లో ముగుస్తుంది కాబట్టి అప్పటిదాకా ఎలాంటి మార్పులు చేయలేమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డారు.

‘2019 వరకు  వేచిచూస్తే  ద్వైపాక్షిక క్రికెట్ ప్రమాదంలో పడుతుంది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో జాతీయ జట్టుకు ఆడకుండా ఫ్రీలాన్స్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టి20 లీగ్‌ల్లో ఆడేందుకే మొగ్గు చూపిస్తామని చాలా మంది క్రికెటర్లు మాతో చెబుతున్నారు. ఆటగాళ్లకు డబ్బులు ఇచ్చే దేశాల్లో  టెస్టులకు ఢోకా ఉండదు. కానీ చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించదు’ అని ఐరిష్ అన్నారు.

మరిన్ని వార్తలు