వీళ్లాడితే... వన్‌సైడే

13 Mar, 2016 06:56 IST|Sakshi
విరాట్ కోహ్లి, మార్టిన్ గప్టిల్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్

అ సాధ్యమనుకున్న దానిని వాళ్లు సుసాధ్యం చేస్తారు. ఇక ఏమాత్రం అవకాశం లేని చోట వాళ్ల బ్యాట్ ధాటికి సీన్ మారిపోతుంది. దూకుడు వారి ఇంటిపేరు... విధ్వంసం వారి అసలు పేరు... షాట్లు ఆడటంలో కొత్తదనం కొసరు పేరు. ఏ జట్టైనా వీళ్లని ఎదుర్కోవాలంటే ఐదారు రకాల ప్లాన్‌లతో రావాలి. అంతగా ఆటను మార్చేయగల సమర్థులు. ఒంటి చేత్తో, ఒకే ఓవర్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఉద్ధండులు. వీళ్లాడితే మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోతుంది. ఈసారి టి20 ప్రపంచకప్‌లో అలాంటి ప్రభావం చూపగల క్రికెటర్లపై ఫోకస్.
 

మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)
పాపులారిటీ పరంగా మార్టిన్ గప్టిల్‌కు గొప్ప పేరు లేకపోవచ్చు. ఐపీఎల్‌లో కూడా అతనికి అవకాశం దక్కకపోవచ్చు. కానీ దూకుడుగా ఆడి జట్టును గెలిపించడంలో అతను ఎవరికంటే తక్కువ కాదు. మెకల్లమ్ దూరం కావడంతో న్యూజిలాండ్ ఆశల భారాన్ని ఇప్పుడు గప్టిల్ మోస్తున్నాడు. ఓపెనర్‌గా అతను ఇచ్చే శుభారంభంపైనే కివీస్ విజయావకాశాలు ఆధార పడి ఉంటాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత గప్టిల్ పేరు ప్రపంచమంతా మారుమోగింది. అయితే టి20ల్లో అతని ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లలో అతను 33, 42, 60, 58, 63, 2, 87 నాటౌట్, 42 పరుగులు చేశాడు. టి20 ప్రమాణాల ప్రకారం చూస్తే అతను ఎంత నిలకడగా ఆడుతున్నాడో అర్థమవుతుంది. భారత్‌లో మా త్రం కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అనుభ వం చూస్తే తాజా ప్రపంచకప్‌లో అత ను ఎలా ఆడతాడో, ఇక్కడ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటాడో అనే సందేహాలు విని పిస్తున్నాయి.
 
 
విరాట్ కోహ్లి (భారత్)
తాను భారీ సిక్సర్లు కొట్టలేనంటూ స్వయంగా కోహ్లి ప్రకటించవచ్చు గాక... కానీ అతను కొట్టే ఫోర్ల విలువే అమూల్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకకుండా ప్రశాంతంగా జట్టును గెలుపు దిశగా నడిపించడంలో కోహ్లి తర్వాతే ఎవరైనా. అడ్డగోలు షాట్ల అవసరం లేకుండానే కళాత్మక ఆటతో కూడా సుతి మెత్తని విధ్వంసం సృష్టించడం కోహ్లికి ఉన్న నైపుణ్యం. మూడో స్థానంలో అతను భారత జట్టుకు అందించిన విజయాలు ఎన్నో. 2014 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కోహ్లి ఒక టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడి ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.

ఇక అతని తాజా ఫామ్ ప్రత్యర్థులకు మింగుడుపడనిదే. ఆస్ట్రేలియాపై 90 నాటౌట్, 59 నాటౌట్, 50 నాటౌట్ పరుగులు చేసిన కోహ్లి, ఇటీవల ఆసియా కప్‌లోనూ నిలకడైన ఆటను ప్రదర్శించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లి బాగా ఆడితే భారత్ గెలుపు గురించి ఇక సందేహాలు అనవసరం. సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న టోర్నీలో తనదైన ముద్ర చూపించేందుకు ఈ స్టార్ ఆటగాడు ఉత్సాహంగా ఉన్నాడు.
 
 
ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
గత కొన్నేళ్లలో సూపర్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్న క్రికెటర్ డివిలియర్స్. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడటంలో అతనికి మరొకరు పోటీ లేరు. ఇప్పటి వరకు వరల్డ్  కప్ గెలవలేకపోయిన సఫారీలు ఇప్పుడు డివిలియర్స్‌పై అమితంగా ఆధారపడుతున్నారు. భారత గడ్డపై అతనికి ఉన్న అపార అనుభవమే అందుకు కారణం. ముఖ్యంగా ఐపీఎల్ కారణంగా ఇక్కడి అన్ని మైదానాలు అతనికి కొట్టిన పిండి. అటు పేస్ బౌలింగ్‌తో పాటు ఇటు స్పిన్‌ను కూడా అలవోకగా ఎదుర్కోగల సామర్థ్యం అతనికి ఉంది. పరిస్థితికి తగినట్లుగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోగల సత్తా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండటం కూడా డివిలియర్స్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడతా యి. 

సాధారణ బ్యాట్స్‌మెన్ ఊహించడానికే సంకోచించే విధంగా కొత్త తరహాలో షాట్లు ఆడటం ఏబీ స్పెషల్.  ఐపీఎల్‌తో పోలిస్తే అంతర్జాతీయ టి20 రికార్డు బలహీనంగా కనిపిస్తున్నా... కీలక సమయాల్లో అతను చెలరేగితే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు. 64 టి20ల్లో 129 స్ట్రైక్ రేట్‌తో 1258 పరుగులు చేసి ఏబీ  సగటు 22.87 మాత్రమే. అదే ఐపీఎల్‌లో 36.71 సగటుతో పరుగులు సాధించడం విశేషం.
 
 
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)      
అంతర్జాతీయ క్రికెట్‌లో బంతిని బలంగా బాదే కొద్ది మంది ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. సాధారణంగా పవర్‌ప్లేలో ధాటిగా ఆడి ఆసీస్‌కు శుభారంభం ఇవ్వడం అలవాటుగా మార్చుకున్న వార్నర్ ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడాడు. అయితే ఏ స్థానమైనా తన శైలి ఇదేనంటూ చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. గత రెండు ఐపీఎల్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ కూడా ఉన్నాడు. భారత్‌లోని పిచ్‌లపై అతనికి ఎంతో అవగాహన ఉంది. ఆసీస్ జట్టులో ఫించ్, మ్యాక్స్‌వెల్‌లాంటి ఇతర హిట్టర్లు ఉన్నా... వారిలో లేని నిలకడ వార్నర్‌లో కనిపిస్తుంది. బాధ్యతాయుతంగా నిలిచి జట్టును గెలిపించడంలో అతనికి ఎంతో మెరుగైన రికార్డు ఉంది. వార్నర్ కెరీర్ స్ట్రైక్‌రేట్ 141 కావడం విశేషం.

 
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
టి20 క్రికెట్ తన కోసమే పుట్టిందా అన్నట్లు గేల్ ఈ ఫార్మాట్‌లో అంతగా ఒదిగిపోయాడు. తొలి బంతినుంచే వీర బాదుడుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించగల గే ల్ క్రీజ్‌లో ఉన్నంత వరకు వెస్టిండీస్ విజయంపై ఎవరికీ సందేహాలు ఉండవు. అతడిని అవుట్ చేయడం అంటేనే ఇక మ్యాచ్ చేతిలోకి వచ్చినట్లు బౌలర్లు భావిస్తారు. ఐపీఎల్‌లో భారీ అనుభవంతో ఇక్కడి పిచ్‌లపై కూడా చెలరేగిపోగల సామర్థ్యం గేల్‌కు ఉంది. ఇక ఇతర లీగ్‌లతో కూడా అతను టి20ల్లో సూపర్ స్టార్‌గా వెలుగుతున్నాడు.

2007లో తొలి ప్రపంచకప్‌లో టి20ల్లో తొలి సెంచరీ కొట్టడం మొదలు 2012లో ఆ జట్టు విజేతగా నిల వడం వరకు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన గేల్... ఇప్పటివరకూ ప్రపంచకప్‌లలో 142 పరుగుల స్ట్రైక్‌రేట్‌తో 807 పరుగు లు చేశాడు. ఇందులో ఏకంగా 49 సిక్సర్లు ఉండటం విశేషం.  తన చివరి రెండు టి20ల్లో గేల్ 77, 90 పరుగులు చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు