‘చాంపియన్’ నిలిచింది

2 Apr, 2014 01:15 IST|Sakshi
‘చాంపియన్’ నిలిచింది

టి20 ప్రపంచకప్ సెమీస్‌లో వెస్టిండీస్
 చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం
 బ్రేవో, స్యామీ సంచలన బ్యాటింగ్
 నరైన్, బద్రీ అద్భుత బౌలింగ్
 
 టి20 క్రికెట్ ఎలా ఆడాలో వెస్టిండీస్ క్రికెటర్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! ఒకరు విఫలమైతే మరొకరు... ఒకరిని మించి వేరొకరు... ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సంచలన ఆటతీరు చూపించారు.
 
 బ్రేవో, స్యామీ పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తే... బద్రీ, నరైన్ స్పిన్ మ్యాజిక్ చేశారు. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరింది. పాకిస్థాన్‌తో హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌ను కరీబియన్ స్టార్స్ ఏకపక్షంగా ముగించారు.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 చావో రేవో తేల్చుకోవాల్సిన, క్వార్టర్ ఫైనల్‌కు సమానమైన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్ తరహా ఆటతీరుతో చెలరేగింది. పాకిస్థాన్‌పై విజయంతో గ్రూప్ ‘2’ నుంచి మూడు విజయాలతో సెమీస్‌కు చేరింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన సూపర్-10 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 84 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (5) మూడో ఓవర్లోనే అవుట్ కావడం... డ్వేన్ స్మిత్ (8) విఫలం కావడంతో విండీస్ కష్టాల్లో పడింది.
 
 ఈ దశలో సిమ్మన్స్ (29 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్యూల్స్ (18 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే 20 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు రామ్‌దిన్ అవుటయ్యాడు. కానీ డ్వేన్ బ్రేవో (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ స్యామీ (20 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన హిట్టింగ్‌తో వెస్టిండీస్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు.

 ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు కేవలం 32 బంతుల్లోనే 71 పరుగులు జోడించడం విశేషం. బ్రేవో, స్యామీల హిట్టింగ్‌తో వెస్టిండీస్ చివరి ఐదు ఓవర్లలో 82 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో హఫీజ్, తన్వీర్, బాబర్, ఆఫ్రిది ఒక్కో వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ 17.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన పాక్ ఓపెనర్ షెహ్‌జాద్ ఈసారి తొలి బంతికే డకౌట్ అయితే... మరో ఓపెనర్ కమ్రాన్ అక్మల్ కూడా రెండో ఓవర్లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
 

 ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో, ఆరో ఓవర్లో బద్రీ మరో రెండు వికెట్లు తీసి పాక్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్‌ను... హఫీజ్ (32 బంతుల్లో 19), మఖ్‌సూద్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్సర్) ఆదుకునే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లలో పాక్ కేవలం 35 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హఫీజ్, మఖ్‌సూద్ వేగం పెంచే ప్రయత్నం చేసి అవుటయ్యారు. ఆఫ్రిది (12 బంతుల్లో 18; 2 సిక్సర్లు) నరైన్ స్పిన్ మ్యాజిక్‌కు వెనుదిరిగాడు. టెయిలెండర్లు కూడా ఏ మాత్రం పోరాడలేకపోయారు.
 
 దీంతో వెస్టిండీస్ స్కోరులో సగం కూడా పాక్ చేయలేకపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో బద్రీ, నరైన్ మూడేసి వికెట్లు తీసుకోగా... సాంటోకీ, రస్సెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.  బ్రేవోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాకిస్థాన్ గ్రూప్-2లో మూడో స్థానంతో టోర్నీని ముగించింది. గత నాలుగు టి20 ప్రపంచకప్‌లలోనూ సెమీస్‌కు చేరిన పాక్ ఈసారి ముందే పోరాటాన్ని ముగించింది.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) కమ్రాన్ (బి) తన్వీర్ 8; క్రిస్ గేల్ (స్టం) కమ్రాన్ (బి) హఫీజ్ 5; సిమ్మన్స్ రనౌట్ 31; శామ్యూల్స్ (బి) ఆఫ్రిది 20; డ్వేన్ బ్రేవో రనౌట్ 46; రామ్‌దిన్ (సి) ఉమర్ (బి) బాబర్ 5; స్యామీ నాటౌట్ నాటౌట్ 42; రస్సెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 166
 వికెట్ల పతనం: 1-10; 2-22; 3-61; 4-67; 5-81; 6-152.
 బౌలింగ్: హఫీజ్ 2-0-15-1; తన్వీర్ 4-0-27-1; బాబర్ 4-0-27-1; ఆఫ్రిది 4-0-23-1; గుల్ 2-0-29-0; అజ్మల్ 4-0-41-0.
 
 పాకిస్థాన్ ఇన్నింగ్స్: షెహ్‌జాద్ ఎల్బీడబ్ల్యు (బి) సాంటోకీ 0; కమ్రాన్ అక్మల్ (సి) బ్రేవో (బి) బద్రీ 0; హఫీజ్ (సి) గేల్ (బి) రస్సెల్ 19; ఉమర్ అక్మల్ (స్టం) రామ్‌దిన్ (బి) బద్రీ 1; షోయబ్ మాలిక్ (స్టం) రామ్‌దిన్ (బి) బద్రీ 2; మఖ్‌సూద్ (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 18; ఆఫ్రిది (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 18; తన్వీర్ (సి) స్యామీ (బి) నరైన్ 14; గుల్ (సి) సిమ్మన్స్ (బి) సాంటోకీ 4; అజ్మల్ (బి) రస్సెల్ 1; బాబర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 82
 వికెట్ల పతనం: 1-0; 2-1; 3-9; 4-13; 5-37; 6-42; 7-74; 8-75; 9-78; 10-82.
 బౌలింగ్: సాంటోకీ 2.5-0-9-2; బద్రీ 4-0-10-3; శామ్యూల్స్ 3-0-21-0; రస్సెల్ 3-0-15-2; నరైన్ 4-0-16-3; డ్వేన్ స్మిత్ 1-0-11-0.
 
 గురువారం జరిగే తొలి సెమీస్‌లో వెస్టిండీస్ జట్టు శ్రీలంకతో
 తలపడుతుంది. గత ప్రపంచకప్ (2012)లో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగింది.
 
 గేల్ ‘వ్యూహం’
 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ విభిన్నమైన వ్యూహంతో పాక్‌పై దాడి చేశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో క్రీజులోకి కొత్త బ్యాట్స్‌మన్ వచ్చిన ప్రతిసారీ పాక్ ఆటగాడి దగ్గరకు వెళ్లి నాలుగు మాటలు విసిరి వచ్చాడు. కీపర్‌తో మాట్లాడుతున్నట్లుగా నిలబడి బ్యాట్స్‌మెన్‌ను దూషించాడు. ఓ దశలో అంపైర్ కల్పించుకుని గేల్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. అయితే గేల్ తాను కీపర్‌తో మాట్లాడుతున్నానంటూ... తన తిట్ల పర్వాన్ని కొనసాగించాడు.
 

>
మరిన్ని వార్తలు