తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్యం

30 Jan, 2020 10:23 IST|Sakshi

జాతీయ సీనియర్‌ టీటీ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్యాన్ని సాధించింది. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్‌ మ్యాచ్‌లో పీఎస్‌పీబీ 3–0తో తెలంగాణపై గెలుపొందింది. మొదట మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ (పీఎస్‌పీబీ) 3–1తో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ (తెలంగాణ)పై, రెండో మ్యాచ్‌లో సతియాన్‌ (పీఎస్‌పీబీ) 3–0తో అమన్‌పై, హర్మీత్‌ దేశాయ్‌ (పీఎస్‌పీబీ) 3–0తో మొహమ్మద్‌ అలీపై గెలుపొందడంతో పీఎస్‌పీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 

అంతకుముందు క్వార్టర్స్‌ మ్యాచ్‌లో తెలంగాణ 3–1తో తమిళనాడు జట్టుపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్‌ (తెలంగాణ) 3–0తో ప్రభాకరన్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్‌ అలీ (తెలంగాణ) 1–3తో నితిన్‌ చేతిలో ఓడిపోయాడు. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అమన్‌ (తెలంగాణ) 3–2తో నిఖిల్‌పై, స్నేహిత్‌ 3–1తో నితిన్‌పై గెలుపొంది జట్టుకు విజయాన్నందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకం సాధించిన తెలంగాణ పురుషుల జట్టును తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి అభినందించారు.   

మరిన్ని వార్తలు