-

మా దేశానికి రావొద్దు...

4 Mar, 2020 00:50 IST|Sakshi

భారత అండర్‌–16 ఫుట్‌బాల్‌ జట్టును కోరిన తజికిస్తాన్‌

కోవిడ్‌–19 భయంతోనే

న్యూఢిల్లీ: తజికిస్తాన్‌లో పర్యటించాలనుకున్న భారత కుర్ర ఫుట్‌బాలర్లకు ‘కరోనా’ షాకిచ్చింది. తమ దేశంలో భారత అండర్‌–16 ఫుట్‌బాల్‌ జట్టు పర్యటనను తజికిస్తాన్‌ రద్దు చేసింది. అండర్‌–15 దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య చాంపియన్‌ అయిన భారత కుర్రాళ్ల జట్టు రేపు అక్కడికి బయలుదేరాల్సి ఉంది. అక్కడ ఏఎఫ్‌సీ అండర్‌–16 చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ అయిన తజికిస్తాన్‌తో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి  ఉంది. అయితే భారత్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో తజికిస్తాన్‌ ప్రభుత్వం భారత్‌ను కరోనా ప్రభావిత దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో 35 దేశాలున్నాయి. ఈ జాబితాలోని దేశాల్లో తమ దేశస్థులు పర్యటించడాన్ని... ఆ దేశస్థులు తమ దేశంలో పర్యటించడాన్ని తజికిస్తాన్‌ నిషేధం విధించడం వల్లే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నట్లు ఆ దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య స్పష్టం చేసింది.

ఆడండి కానీ... ఆటోగ్రాఫ్‌లు వద్దే వద్దు! 
ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌–19)తో అమెరికాలో ఆరుగురు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన జాతీయ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) తమ ఆటగాళ్లకు, జట్ల కోచ్‌లు, ఫిజియో, ఇతర సిబ్బందికి తు.చ. తప్పకుండా పాటించే మార్గదర్శకాలు జారీచేసింది. ఆటగాళ్లెవరూ అభిమానులతో కలవరాదని కచ్చితంగా చెప్పేసింది. ఆటోగ్రాఫ్‌లు చేసేందుకు, పెన్నులను ముట్టుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు దూరంగా ఉండాలని ఎన్‌బీఏ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తమ ప్రధాన ఉద్దేశమని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.

కరచాలనం ఇవ్వం: జో రూట్‌

శ్రీలంకలో క్రికెట్‌ సిరీస్‌ ఆడేందుకు మంగళవారం అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు అక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయబోరని కెప్టెన్‌ జో రూట్‌ వెల్లడించాడు. కరోనా ఎఫెక్ట్‌ వల్లే పరస్పర కరచాలనం చేయొద్దని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడ్డారు. అయితే త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడైతే కోవిడ్‌–19 ప్రపంచాన్నే వణికిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా శుచి–శుభ్రతను పాటిస్తామని, తమ క్రికెట్‌ బోర్డు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకుంటామని రూట్‌ చెప్పాడు.

నిర్‌‘బంధి’ంచారు... 
అబుదాబీలో విదేశీ సైక్లిస్ట్‌లకు వింత అనుభవం ఎదురైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు వచ్చిన జట్లలో కొందరికి కరోనా సోకడంతో వాళ్లని వెంటనే వారి స్వదేశాలకు పంపేసిన అబుదాబీ వర్గాలు మిగతా వారిని బస చేసిన హోటల్‌ గదుల్లోనే నిర్బంధించింది. ఫ్రాన్స్, రష్యా దేశాలకు చెందిన సైక్లిస్ట్‌లకు, సిబ్బందికి నిర్బంధం విధించిన యూఏఈ ప్రభుత్వం వైరస్‌ బారిన పడిన ఇద్దరు ఇటాలియన్‌ అధికారుల్ని ఉన్నపళంగా ఇటలీకి ప్రత్యేక విమానాల్లో పంపించింది.

మరిన్ని వార్తలు