ఫ‍్యామిలీని ఎందుకు లాగుతారు: రోహిత్‌

6 Jan, 2020 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంకతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీల గురించి గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మీడియా పెద్ద చేసి చూపడంపై రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు తమ ఫ్యామిలీల గురించి మీడియా ఎందుకు ఆసక్తి చూపుతుందంటూ ప్రశ్నించాడు. ఏమైనా చెప్పాలనుకుంటే తమ గురించి మాత్రమే రాయాలని, అంతే తప్ప ప్రతీ విషయంలో కుటుంబాన్ని లాగడం మంచి పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.(ఇక్కడ చదవండి: ధోనిని కాదని.. రోహిత్‌కే ఓటు)

వరల్డ్‌కప్‌ సమయంలో చోటు చేసుకున్న వివాదం గురించి రోహిత్‌ పెదవి విప్పాడు. ‘ మా ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మమ్మల్ని సంతోషంగా ఉంచే క‍్రమంలో వారు మాతో ఉంటే తప్పేంటి. మా కుటుంబ సభ్యులు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని వార్తలు రాశారు. ఇక్కడ మా ఫ్యామిలీల గురించి ఎందుకు. మా కుటుంబల గురించి రాస్తున్నారని స్నేహితులు చెబితే నవ్వుకున్నా. ఇప్పుడు ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఒకవేళ నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే అది నాకే పరిమితం చేయండి. ఫలానా వాళ్లు మా గురించి ఏదో అంటున్నారని రాస్తే దాన్ని మేము లెక్కచేయాల్సిన పనిలేదు.

ఇప్పటికే విరాట్‌ కోహ్లి ఇదే విషయంపై స్పష్టత కూడా ఇచ్చాడు. కుటుంబాలు అనేవి మా జీవితంలో కూడా చాలా ముఖ్యమైనవనే సంగతి గుర్తుంచుకోవాలి’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. గతేడాది ఓపెనర్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ సాధించాడు. ఈ క్రమంలోనే 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య రికార్డును బ్రేక్‌ చేశాడు.

మరిన్ని వార్తలు