‘షేన్’దార్ రాయల్స్

6 May, 2014 01:19 IST|Sakshi
‘షేన్’దార్ రాయల్స్

అద్భుతం... అసాధ్యాలు సుసాధ్యం కావడం... ఒక్క ఓవర్లో మ్యాచ్ ఫలితం తారుమారు కావడం... ఇవన్నీ టి20 ఫార్మాట్‌లోనే సాధ్యం. వారం క్రితం సూపర్ ఓవర్‌ను కూడా టై చేసుకున్న రాజస్థాన్, కోల్‌కతా.. మరోసారి టి20 క్రికెట్‌లోని మజాను రుచి చూపించాయి. అసలు ఇదెలా సాధ్యం..! అని ఆశ్చర్యపోయేలా రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్‌ను అనూహ్యంగా గెలిచారు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టూ ఓడిపోని విధంగా... అత్యంత నాటకీయంగా కోల్‌కతా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది.
 
- రాజస్థాన్ సంచలన విజయం
- షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ షో
- పవీణ్ తాంబే హ్యాట్రిక్
- నాటకీయంగా కుప్పకూలిన కోల్‌కతా

 

రెండు బంతుల్లో హ్యాట్రిక్ !
తాంబే ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించినా... లీగల్‌గా తను వేసింది రెండు బంతులే. తొలి బంతి వైడ్ అయినా స్టంపౌట్ రూపంలో వికెట్ వచ్చింది. తర్వాతి రెండు లీగల్ బంతులకు రెండు వికెట్లు వచ్చాయి. టి20ల్లో ఇలా రెండు బంతుల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి భారత క్రికెటర్ తాంబే. గతంలో చాంపియన్స్‌లీగ్‌లో  ఇసురు ఉదాన (శ్రీలంక) రెండు బంతుల్లో ఇలాగే హ్యాట్రిక్ సాధించాడు.
 

 

అహ్మదాబాద్: లక్ష్యం 171... స్కోరు 14 ఓవర్లలో 121/0... ఈ దశలో ఏ జట్టైనా అలవోకగా గెలుస్తుంది. కానీ కోల్‌కతా మాత్రం నాటకీయంగా కుప్పకూలి అనూహ్యంగా ఓడిపోయింది. కేవలం 8 బంతుల వ్యవధిలో రెండే పరుగులు జతచేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆడుతూ పాడుతూ గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘోర పరాజయం పాలైంది. షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ నైపుణ్యానికి.. స్పిన్నర్ ప్రవీణ్ తాంబే హ్యాట్రిక్ తోడవడంతో... సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచింది.

టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే (22 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్), కరుణ్ నాయర్ (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. సంజు శామ్సన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు), వాట్సన్ (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొత్తం బ్యాట్స్‌మెన్ అంతా సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ భారీస్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వినయ్ కుమార్, నరైన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు గంభీర్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్), ఉతప్ప (52 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి... విజయానికి కావలసిన ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు.

అయితే వాట్సన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం... ఆ వెంటనే తర్వాతి ఓవర్లోనే తాంబే హ్యాట్రిక్ సాధించడంతో కేవలం 2 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇక కోలుకోలేకపోయింది. చివర్లో షకీబ్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, తాంబే మూడేసి వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
స్కోరు వివరాలు
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 30; కరుణ్ నాయర్ (స్టం) ఉతప్ప (బి) షకీబ్ 44; శామ్సన్ (సి) పాండే (బి) నరైన్ 37; వాట్సన్ (సి) యాదవ్ (బి) నరైన్ 31; బిన్నీ (సి) టెన్ డష్కటే (బి) వినయ్ 11; స్టీవ్ స్మిత్ (సి)  యాదవ్ (బి) వినయ్ 3; ఫాల్క్‌నర్ నాటౌట్ 1; భాటియా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 2, నోబాల్ 1) 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170.
 వికెట్ల పతనం: 1-52; 2-105; 3-136; 4-153; 5-163; 6-163.
 బౌలింగ్: వినయ్ కుమార్ 4-0-42-2; ఉమేశ్ యాదవ్ 3-0-31-0; షకీబ్ అల్ హసన్ 4-0-25-1; నరైన్ 4-0-28-2; రస్సెల్ 3-0-27-0; టెన్ డష్కటే 2-0-14-0.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) భాటియా (బి) వాట్సన్ 65; గంభీర్ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 54; రస్సెల్ (బి) వాట్సన్ 1; పాండే (స్టం) శామ్సన్ (బి) తాంబే 0; షకీబ్ నాటౌట్ 21; యూసుఫ్ పఠాన్ (సి) అండ్ (బి) తాంబే 0; డష్కటే ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 0; సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 5, వైడ్లు 3, నోబాల్స్ 2) 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 160.
 వికెట్ల పతనం: 1-121; 2-122; 3-122; 4-123; 5-123; 6-123.  బౌలింగ్: వాట్సన్ 4-0-21-3; సౌతీ 3-0-33-0; తాంబే 4-0-26-3; ఫాల్క్‌నర్ 4-0-27-0; భాటియా 3-0-30-0; టెవాటియా 2-0-18-0.
 
కళ్లుచెదిరే క్యాచ్‌లు

తొలుత రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా నిర్మించారు. రహానే, నాయర్, శామ్సన్13 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుతూనే 105 పరుగులు చేశారు. దీంతో వాట్సన్ హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధమైంది. కెప్టెన్ వాట్సన్ అంచనాలను నిలబెట్టుకుంటూ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ దశలో రాయల్స్ 180-190 పరుగులు దిశగా సాగింది. కానీ కోల్‌కతా ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లతో నియంత్రించారు. ముఖ్యంగా వాట్సన్ క్యాచ్‌ను సూర్యకుమార్ అత్యద్భుతంగా అందుకున్నాడు. అలాగే బిన్నీ క్యాచ్‌ను టెన్‌డష్కటే అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రాయల్స్ 170 పరుగులకు పరిమితమైంది.
 
 121/0.... 123/6

 కోల్‌కతాకు గంభీర్, ఉతప్ప కళ్లుచెదిరే ఆరంభాన్నిచ్చారు. టోర్నీలో తొలిసారి గంభీర్ అర్ధసెంచరీ చేయగా... ఉతప్ప అద్భుతమైన షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ ఎక్కడా తడబడకుండా ఆడి కోల్‌కతాను పటిష్ట స్థితిలో నిలిపారు. 15వ ఓవర్లో డ్రామా మొదలైంది. వాట్సన్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే గంభీర్ అవుట్ అయ్యాడు. మూడో బంతిని పుల్ చేసిన ఉతప్ప బౌండరీ దగ్గర సులభమైన క్యాచ్ ఇచ్చాడు. చాలా నిర్లక్ష్యపు షాట్ ఇది. ఇదే ఓవర్ ఐదో బంతికి వాట్సన్... రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు (అది కూడా ఓవర్ త్రో) మాత్రమే వచ్చింది. తర్వాతి ఓవర్‌లో తాంబే తొలి బంతిని వైడ్ వేశాడు. కానీ మనీష్‌పాండే ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దీంతో మళ్లీ ఇదే ఓవర్ తొలి బంతి వేసిన తాంబే... యూసుఫ్ పఠాన్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి బంతి టెన్ డష్కటే ఎల్బీగా అవుట్ కావడంతో తాంబేకు హ్యాట్రిక్ దక్కింది. కేవలం రెండు పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇక ఆ తర్వాత కోలుకోలేకపోయింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


మరిన్ని వార్తలు