మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

22 Jul, 2019 06:47 IST|Sakshi
టైటాన్స్‌ రైడర్‌ను పట్టేసిన తమిళ్‌ తలైవాస్‌ ఆటగాళ్లు

తమిళ్‌ తలైవాస్‌ విజయం

ప్రొ కబడ్డీ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో అంచనాల నడుమ ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7 బరిలో దిగిన తెలుగు టైటాన్స్‌ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 26–39 స్కోరుతో తమిళ్‌ తలైవాస్‌ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్‌ నుంచి తలైవాస్‌కు వెళ్లిన స్టార్‌ ప్లేయర్‌ రాహుల్‌ చౌదరి (10 రైడ్‌ పాయింట్లు, 2 టాకిల్‌ పాయింట్లు) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా మంజీత్‌ చిల్లర్‌ 5 పాయింట్లతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. టెటాన్స్‌ తరపున సిద్ధార్థ్‌ దేశాయ్‌ (5 పాయింట్లు) మళ్లీ మెరిపించలేకపోయాడు.  

తొలి పది నిమిషాలే నిలబడింది...
తలైవాస్‌తో పోరులో టైటాన్స్‌ మొదటి పది నిమిషాలే పోటీ ఇవ్వగలిగింది. తొలి నిమిషంలోనే రాహుల్‌ తలైవాస్‌కు బోణీ చేశాడు. అయితే 4వ నిమిషంలో టైటాన్స్‌ సూపర్‌ టాకిల్‌ చేసి స్కోర్‌ను 3–4కు తగ్గించింది. టెటాన్స్‌ స్టార్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ తన మొదటి పాయింట్‌ను సాధించడానికి 6 నిమిషాల సమయం పట్టింది. తొలి 10 నిమిషాల ఆట ముగిసేసరికి టైటాన్స్‌ 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి ఓటమికి తలైవాస్‌ ఆటగాడు షబీర్‌ బాపు బాటలు వేశాడు. మొదట సూపర్‌ టాకిల్‌తో రెండు పాయింట్లు సాధించిన షబీర్‌... తర్వాత వెంట వెంటనే రెండు రైడ్‌ పాయింట్లు తెచ్చాడు.

16వ నిమిషంలో రాహుల్‌ రెండు రైడ్‌ పాయింట్లతో.. 18వ నిమిషంలో అజయ్‌ థాకూర్‌ సూపర్‌ రైడ్‌తో అదరగొట్టడంతో మొదటి అర్ధ భాగం ముగిసే సరికి తలైవాస్‌ 20–10తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల కోసం శ్రమించినా తలైవాస్‌ మోహిత్, మంజీత్‌ల పటిష్టమైన డిఫెన్స్‌ను చేధించడంలో సఫలం కాలేకపోయారు. అంతకుముందు జరిగిన మరో లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌ 42–24 తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది.

నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌; పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి. మ్యాచ్‌లను రాత్రి గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

>
మరిన్ని వార్తలు