అతని తర్వాత రాస్‌ టేలర్‌ ఒక్కడే..

3 Dec, 2019 14:09 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు.  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టేలర్‌(105 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో ఏడువేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం రాస్‌ టేలర్‌ 7,023 టెస్టు పరుగులతో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఏడువేల పరుగులు సాధించిన 51వ క్రికెటర్‌ టేలర్‌ కాగా, న్యూజిలాండ్‌ తరఫున ఆ ఫీట్‌ సాధించిన రెండో క్రికెటర్‌. అంతకుముందు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాత్రమే కివీస్‌ తరఫున ఆ మార్కును చేరాడు. ఫ్లెమింగ్‌ తన కెరీర్‌లో 111 మ్యాచ్‌లకు గాను 189 ఇన్నింగ్స్‌లు ఆడి 7,172 పరుగులతో ఉన్నాడు.

అతని తర్వాత కివీస్‌ తరఫున ఏడువేల టెస్టు పరుగుల క్లబ్‌లో చేరిన క్రికెటర్‌గా టేలర్‌ గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకూ 96  టెస్టులు ఆడిన టేలర్‌ 19 సెంచరీలు, 32 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో 228 వన్డేలు ఆడగా 8, 376 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 95 మ్యాచ్‌లు ఆడి 1,743 పరుగులతో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: ఇంతటి వరస్ట్‌ క్యాచ్‌ డ్రాపింగ్‌ చూశారా?)

ఇటీవల ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ వేగవంతంగా ఏడువేల టెస్టు పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. స్మిత్‌ తన 126వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే ఏడువేల పరుగులు పూర్తి చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు హామండ్‌ రికార్డును స్మిత్‌ బ్రేక్‌ చేశాడు. హామండ్‌ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడువేల పరుగుల్ని  సాధించాడు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 134 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల టెస్టు పరుగులు సాధించి మూడో స్థానంలో కొనసాగుతన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ 136వ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును చేరగా, గ్యారీ సోబర్స్‌, కుమార సంగక్కరా, విరాట్‌ కోహ్లిలు తమ 138 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగులు సాధించారు.

>
మరిన్ని వార్తలు