క్రికెట్ చరిత్రలో మళ్లీ ఇలా జరగదేమో..!

12 Feb, 2018 11:11 IST|Sakshi
అఫ్గానిస్తాన్ క్రికెటర్లు, జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్

సెంచరీతో చెలరేగిన కీపర్ బ్రెండన్ టేలర్

రెండో వన్డేలో జింబాబ్వే ఘన విజయం

సిరీస్‌లో ఆసక్తికర గణాంకాలు నమోదు

షార్జా: క్రికెట్ చరిత్రలో కొన్నిసార్లు అరుదైన సంఘటనలు అవిష్కృతమవుతాయి. మళ్లీ అలాంటి ఫీట్లు జరిగే అవకాశం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు సైతం అఫ్గానిస్తాన్, జింబాబ్వే వన్డే సిరీస్‌ గురించి అభిప్రాయపడుతున్నారు. ఓ వన్డేలో ఓడితే తర్వాతి వన్డేలో ప్రత్యర్థిపై రెండో జట్టు ప్రతీకారం తీర్చుకుంటుంది. అందులో భాగంగా ఆ మరుసటి వన్డేలో నమోదైన గణాంకాలు మాత్రం క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఒకే సిరీస్ లో ఇలా జరిగినా.. వరుస వన్డేల్లో ఇలాంటి ఫీట్ కావడం కష్టమే. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

తమ వన్డే క్రికెట్‌లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మరుసటి వన్డేలో అదే ప్రత్యర్థి జింబాబ్వే చేతిలో అంతే పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. రెండో వన్డేలో నెగ్గిన జింబాబ్వే తొలి వన్డే దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇరుజట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. జింబాబ్వే స్టార్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ (125; 121 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో పాటు సికిందర్ రజా (92; 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లాడి 5 వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు జింబాబ్వే బౌలర్లు గ్రేమ్ క్రీమర్ (4/41), చతారా (3/24)లు విజృంభించడంతో 30.1 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ జట్టులో రహ్మద్ షా (43), దౌలత్ జర్దాన్ (47 నాటౌట్) మాత్రమే ఆ జట్టు 154 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది.

తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ 5 వికెట్లకు 333 పరుగులు చేయగా, ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 34.4 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో వన్డేలో అదే స్కోర్లు నమోదయ్యాయి. కానీ జట్లే మారాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం ఆలౌటైన జట్టు ఆడిన ఓవర్లలోనే వ్యత్యాసం తప్ప.. ఇతర అన్ని అంశాలు ఒకేలా రిపీట్ కావడం క్రికెట్ చరిత్రలోనే అరుదైనదిగా భావించవచ్చు.

తొలి వన్డే: 
అఫ్గానిస్తాన్‌: 333/5
జింబాబ్వే: 179 ఆలౌట్ 

రెండో వన్డే:
జింబాబ్వే: 333/5
అఫ్గానిస్తాన్‌: 179 ఆలౌట్

మరిన్ని వార్తలు