టీమిండియా రికార్డు ‘ఇన్నింగ్స్‌’

6 Oct, 2018 11:42 IST|Sakshi

రాజ్‌కోట్‌: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 181 పరుగులకు ఆలౌట్‌ చేయడం ద్వారా టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగుల ఆధిక‍్యం సాధించింది. ఫలితంగా భారత్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది మూడో అత్యుత్తమ తొలి ఇన‍్నింగ్స్‌ లీడ్‌గా నిలిచింది. అంతకుముందు 2007లో బంగ్లాదేశ్‌పై మిర్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ సాధించిన 492 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం తొలి స్థానంలో ఉండగా, 2011లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో భారత్‌ 478 పరుగుల ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆధిక్యం రెండో స్థానంలో ఉంది. ప‍్రస్తుత టెస్టు మ్యాచ్‌లో సాధించిన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం భారత్‌కు మూడో అత్యుత్తమంగా నిలిచింది.

ఇదిలా ఉంచితే, ప్రత్యర్థి జట్టుకు అత్యధిక పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అప్పగించిన అపప్రథను విండీస్‌ మరోసారి మూటగట్టుకుంది. విండీస్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన జాబితాలో తాజా తొలి ఇన్నింగ్స్‌ మూడో స్థానంలో నిలిచింది. 1930లో ఇంగ్లండ్‌పై 563 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సమర్పించుకున్న విండీస్‌.. 2011లో భారత్‌కు 478 పరుగుల ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అప్పగించింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌కు ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా నమోదైంది.

విండీస్‌కు తప్పని ఫాలోఆన్‌

మరిన్ని వార్తలు