టీమిండియానే తొలి జట్టు

7 Sep, 2017 16:12 IST|Sakshi
టీమిండియానే తొలి జట్టు

సాక్షి, కొలంబో: విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన జట్టు పొట్టి క్రికెట్‌లోనూ తమ పదును చూపించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. ద్వైపాక్షిక సిరీస్ ను ఓటమి లేకుండా ముగించింది.నిన్నటి మ్యాచ్ లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 170/7 పరుగులకు టీమిండియా కట్టడి చేసింది. దిల్షాన్‌ మునవీరా (53) అర్ధ సెంచరీ సాధించగా, అషాన్‌ ప్రియాంజన్‌ ( 40 నాటౌట్) రాణించాడు.  అనంతరం భారత్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (54 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగిపోగా... మనీశ్‌ పాండే (36 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో అతనికి సహకరించాడు. ఓవరాల్ గా 9-0తో సిరీస్ ను దిగ్విజయం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయగా, వన్డే సిరీస్ ను 5-0తో భారత్ గెలిచింది. దాంతో 9-0తో సిరీస్ పరిపూర్ణమైంది.


తద్వారా ఒక దైపాక్షిక సిరీస్ లో ఆతిథ్య జట్టును అన్ని ఫార్మాట్లలో కలిపి 9-0తో చిత్తు చేసిన తొలి పర్యాటక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఒక పర్యాటక జట్టు ఈ తరహా ఘనతను సాధించిన రికార్డు లేదు. కాకపోతే గతంలో ఆస్ట్రేలియా 9-0తో పాక్ ను చిత్తు చేసింది.  2010లో ఆస్ట్రేలియా స్వదేశంలో ఈ ఫీట్ ను సాధించింది.అయితే అది ఆసీస్ ఆతిథ్యమిచ్చిన ద్వైపాక్షిక సిరీస్. ఇప్పుడు భారత్ ఒక పర్యాటక జట్టుగా అరుదైన మైలురాయిని చేరుకుంది. మరొకవైపు ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లలో ఆసీస్ తో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.1985-87 మధ్య కాలంలో ఒకే జట్టుపై ఆసీస్ వరుసగా తొమ్మిది విజయాల్ని సాధించింది. ఇదిలా ఉంచితే, అత్యధిక వరుస విజయాలు సాధించిన ఘనత మాత్రం విండీస్, ఆసీస్ ల పేరిట ఉంది. ఈ రెండు జట్లు 10 వరుస విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు