అశ్విన్ ఖాతాలో మరో అవార్డ్

25 May, 2017 09:52 IST|Sakshi
అశ్విన్ ఖాతాలో మరో అవార్డ్

ముంబై:: టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2017 అవార్డును అశ్విన్ సొంతం చేసుకున్నాడు. గతేడాది 99 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విషయం తెలిసిందే. సియట్ క్రికెట్ రేటింగ్ (సీఆర్ఆర్) ఇంటర్నేషనల్ అవార్డ్స్-2017లో భాగంగా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చైర్మన్ హర్ష్ గోయంకా ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా స్పిన్నర్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తాను తీసుకున్న తొలి ఆటోగ్రాఫ్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ దేనని గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ లో పుణే బౌలర్ వాషింగ్టన్ సుందర్ ప్రదర్శనపై ప్రశంసల జల్లులు కురిపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో సుందర్ రాణించాడు. ట్వంటీ 20లలో ఎలా బౌలింగ్ చేయాలో సుందర్ త్వరగా నేర్చుకున్నాడని కొనియాడాడు. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లతో జరిగిన 13 టెస్టుల్లో 10 టెస్టులు భారత్ నెగ్గడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు.

యువ సంచలనం శుభమన్ గిల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ముంబైలో జరిగిన భారత్-ఇంగ్లండ్ అండర్-19 వన్డే సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శనతో గిల్ ను ఈ అవార్డు వరించింది.

మరిన్ని వార్తలు