కలసికట్టుగా  కొట్టేశారు

27 Jan, 2019 01:36 IST|Sakshi

రెండో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం

మెరిసిన బ్యాట్స్‌మెన్‌  రాణించిన బౌలర్లు 

న్యూజిలాండ్‌పై 90 పరుగులతో గెలుపు

రేపు మూడో వన్డే

అదే జోరు... అదే ఊపు! న్యూజిలాండ్‌పై వరుసగా రెండో విజయం అందుకునే క్రమంలో టీమిండియా ఎక్కడా పట్టు విడవలేదు. క్రీజులోకి దిగిన ఒక్కొక్క బ్యాట్స్‌మెన్‌ తమవంతుగా పరుగులు జోడిస్తే... బంతినందుకున్న బౌలర్లు బాధ్యతగా వరుసగా వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ప్రత్యర్థిని కుదేలు చేస్తూ... కోహ్లి సేన సునాయాసంగా గెలిచేసింది. అన్ని రంగాల్లో భారత్‌ విజృంభణతో... కివీస్‌ తేలిపోయి చేతులెత్తేసింది.  

మౌంట్‌ మాంగనీ: బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించి అందించిన ఆత్మవిశ్వాసంతో చెలరేగిన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ పని పట్టారు. ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యం, మిడిలార్డర్‌ సమయోచిత ఆట, బౌలర్ల విజృంభణతో ప్రత్యర్థికి ఏమాత్రం అవ కాశం ఇవ్వకుండా ఆడిన కోహ్లి సేన... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన వన్డేలో తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (96 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు); శిఖర్‌ ధావన్‌ (67 బంతుల్లో 66; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించి శుభారంభం ఇవ్వగా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (45 బంతుల్లో 43; 5 ఫోర్లు), అంబటి రాయుడు (49 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఎంఎస్‌ ధోని (33 బంతుల్లో 48 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కేదార్‌ జాదవ్‌ (10 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ స్కోరుకు తోడ్పడ్డారు. ఛేదనలో స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/45), యజువేంద్ర చహల్‌ (2/52), పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (2/42) దెబ్బకు కివీస్‌ 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. లోయరార్డర్‌ బ్యాట్స్‌మన్‌ డగ్లస్‌ బ్రాస్‌వెల్‌ (46 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసిన పరుగులే ఆ జట్టు ఇన్నింగ్స్‌లో అత్యధికం. దీంతో భారత్‌ 90 పరుగులతో గెలుపొందింది. మూడో వన్డే సోమవారం మౌంట్‌ మాంగనీలోనే జరుగనుంది. రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

అందరూ ఆడారు 
పిచ్‌పై ఉన్న అంచనాలతో టాస్‌ గెలిచిన కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభ ఓవర్‌లోనే రోహిత్‌ రెండు గండాల నుంచి బయటపడ్డాడు. అటు ధావన్‌కు కూడా బంతి రెండుసార్లు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. ఇవి మినహా వీరిద్దరూ సాధికారికంగా ఆడారు. పోటాపోటీగా అర్ధ సెంచరీల వైపు కదిలారు. ఈ క్రమంలో ఫెర్గూసన్‌ ఓవర్లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా సిక్స్‌ కొట్టి రోహిత్‌ హాఫ్‌ సెంచరీ (62 బంతుల్లో) అందుకున్నాడు. ఓపెనింగ్‌ భాగస్వామ్యామూ 100 దాటింది. కాసేపటికే ధావన్‌ సైతం అర్ధశతకం (53 బంతుల్లో) చేరుకున్నాడు. అయితే, వికెట్లకు దూరంగా వెళ్తున్న బౌల్ట్‌ బంతిని ఆడబోయి అతడు వెనుదిరిగాడు. దీంతో 154 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. సెంచరీ చేయడం ఖాయంగా కనిపించిన రోహిత్‌... పుల్‌ షాట్‌కు యత్నించి డీప్‌స్క్వేర్‌ లెగ్‌లో గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కోహ్లి, రాయుడు మరీ దూకుడుకు పోకుండా పరిస్థితులకు తగ్గట్లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. కోహ్లి వెనుదిరిగాక... ధోని, రాయుడు బాధ్యత తీసుకున్నారు. అర్ధసెంచరీ ముంగిట రాయుడు ఔటయ్యాడు. ధోని, జాదవ్‌ తాము ఎదుర్కొన్న 26 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు స్కోరును 300 దాటించారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో 21 పరుగులు రావడం విశేషం. 

బౌలర్లు పడగొట్టారు 
భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌లా కివీస్‌ ఇన్నింగ్స్‌లో తొలి బంతికే గప్టిల్‌ (15)కు లైఫ్‌ దక్కింది. రనౌట్‌ ప్రమాదంతో పాటు స్లిప్‌లో రోహిత్‌ క్యాచ్‌ వదిలేయడంతో బయటపడిన అతడు ఎంతోసేపు నిలవలేదు. భువీ షార్ట్‌ బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడి బౌండరీ వద్ద చహల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. షమీ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు, ఫోర్‌ సహా నాలుగు బంతుల్లో 18 పరుగులు రాబట్టిన కెప్టెన్‌ విలియమ్సన్‌ (20)... మరుసటి బంతినే వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డయ్యాడు. మున్రో (31) వికెట్ల ఎదుట చహల్‌కు దొరికిపోయాడు. జాదవ్‌ ఓవర్లో ధోని మెరుపు స్టంపింగ్‌ రాస్‌ టేలర్‌ (22) ఆట కట్టించింది. జట్టును కొంత దూరం లాక్కొచ్చిన లాథమ్‌ (34)ను కుల్దీప్‌ ఎల్బీ చేశాడు. గ్రాండ్‌హోమ్‌ (3), నికోల్స్‌ (28), సోధి (0)... కుల్దీప్‌ మాయలో పడిపోవడంతో కివీస్‌ 166/8తో నిలిచింది. ఈ దశలో లోయరార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బ్రాస్‌వెల్‌ బ్యాట్‌ ఝళిపించాడు. 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. అతడిని భువీ, ఫెర్గూసన్‌ (12)ను చహల్‌ ఔట్‌ చేయడంతో ఆతిథ్య జట్టు ఆట ముగిసింది.  

మరిన్ని వార్తలు