టీమిండియా సూపర్ షో

12 Oct, 2016 08:33 IST|Sakshi
టీమిండియా సూపర్ షో

ఇండోర్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులోనూ కివీస్ ను ఓడించి 3-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. చివరి టెస్టులో 321 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఆట నాలుగో రోజు 475 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 44.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.

ఆరంభం నుంచే భారత బౌలర్లు విజృంభించడంతో కివీస్ బ్యాట్స్ మెన్లు ఒకరివెనుక ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు. స్పిన్నర్లను ఎదుర్కొని నిలబడలేక చేతులెత్తేశారు. అశ్విన్  మరోసారి విజృంభించాడు. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత ఫాస్ట్ బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

టేలర్(32) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గప్తిల్ 29, విలియమ్సన్ 27, రోంచి 15, శాంట్నర్ 14 పరుగులు చేశారు. వాట్లింగ్(23) నాటౌట్ గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 557/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, న్యూజిలాండ్ 299 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 216/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా అశ్విన్ ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు