టీమిండియానే నెం.1

1 May, 2018 15:39 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌ (ఫైల్‌ ఫొటో)

ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లిసేన ర్యాంకు పదిలం

దుబాయ్ : అంతర్జాతీ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం నిలబెట్టుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 125 రేటింగ్ పాయింట్లతో కోహ్లిసేన తొలి స్థానంలో నిలిచింది. 112 పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. మే 1, 2018 నాటికి భారత్, దక్షిణాఫ్రికా మధ్య 13 పాయింట్ల వ్యత్యాసం ఉంది. టీమిండియాను చేరుకోవాలంటే మిగతా జట్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. 

2014-15 ఏడాది ఫలితాలను పక్కనబెట్టి 2015-16, 2016-17 సీజన్లలో జట్ల ఫలితాల్లో 50శాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఐసీసీ ఈ వార్షిక ర్యాంకులను  ప్రకటించింది. ఇంతకుముందు ద్వితీయ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, టీమిండియాకు 4 పాయింట్లే తేడా ఉండగా.. తాజా ర్యాంకులతో ఆ వ్యత్యాసం 13 పాయింట్లకు పెరిగింది. సఫారీ జట్టు 5 పాయింట్లు కోల్పోయి 112 పాయింట్లకు పడిపోయింది. 106 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో 102 పాయింట్లతో న్యూజిలాండ్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌ బిజీలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. అనంతరం అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు..తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు