10కి 9సార్లు 200 స్కోరు దాటలేదు..

16 Nov, 2019 10:27 IST|Sakshi

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. శనివారం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్‌ స్కోరు 493/6వద్దే డిక్లేర్డ్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కాగా, ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కాసేపటికే రెండు కీలక వికెట్లను బంగ్లా కోల్పోయింది. 16  పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ ఎదురీదుతోంది.  బంగ్లాదేశ్‌ ముందు 343 పరుగుల ఆధిక్యాన్ని ఉంచి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసి టీమిండియా సవాల్‌ విసిరింది. అయితే బంగ్లా ఓపెనర్లు ఇమ్రుల్‌(6), షాద్‌మన్‌ ఇస్లామ్‌(6)లు విఫలమయ్యారు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతికి ఇమ్రుల్‌ బౌల్డ్‌ కాగా, ఇషాంత్‌ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి షాద్‌మన్‌ కూడా బౌల్డ్‌ అయ్యాడు. దాంతో భారత్‌ మూడో రోజే మ్యాచ్‌ను గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి.(ఇక్కడ చదవండి: ‘సగర్వా’ల్‌ 243)

చివరి పది సందర్భాలను పరిగణలోకి తీసుకుంటే భారత్‌లో పర్యటించిన జట్లు తమ తమ రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయ్యాయి. భారత్‌లో పర్యాటక జట్ల గత పది రెండో ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే అవి కనీసం రెండొందల దాటడానికే ఆపసోపాలు పడ్డాయి.  పర్యాటక జట్లు తమ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదిసార్లు రెండొందల స్కోరు అధిగమించలేకపోవడం భారత్‌ ఆధిపత్యానికి నిదర్శనగా కనబడుతోంది. కేవలం ఒకసారి మాత్రమే రెండొందల స్కోరును ఒక పర్యాటక జట్టు అధిగమించింది. ఇక తమ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది సార్లు రెండొందల దాటని సందర్భాల్లో ఎనిమిదిసార్లు ప్రత్యర్థి జట్టును భారత్‌ ఆలౌట్‌ చేయడం విశేషం.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్‌ పూర్తి ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌(243), పుజారా(54), రహానే(86), జడేజా(60 నాటౌట్‌)లు రాణించడంతో భారత్‌ భారీ స్కోరు నమోదు చేసింది.ఆపై వికెట్ల వేటను కొనసాగిస్తోంది. మరి బంగ్లాదేశ్‌ను కూడా రెండో ఇన్నింగ్స్‌లో రెండొందల లోపే భారత్‌ ఆలౌట్‌ చేసి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు