అయ్యో.. సఫారీలు

21 Oct, 2019 13:46 IST|Sakshi

రాంచీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు మళ్లీ ఫాలోఆన్‌ ముప్పు తప్పలేదు. రెండో టెస్టులో ఫాలోఆన్‌ ఆడిన దక్షిణాఫ్రికా.. మూడో టెస్టులో సైతం వెంటనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించాల్సి వచ్చింది. సోమవారం మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలడంతో ఆ జట్టును టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో రెండొందల పరుగులకు పైగా వెనుకబడి ఉండటంతో వారు ఫాలోఆన్‌ గండం నుంచి తప్పించుకోలేకపోయారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌తో చూస్తే సఫారీలు 335 పరుగులు వెనుకబడ్డారు.

9/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి డుప్లెసిస్‌-హమ్జాలు బ్యాటింగ్‌కు దిగారు. కాగా, ఈ రోజు ఆటలో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగు బంతుల్ని హమ్జా ఆడగా, ఐదో బంతిని డుప్లెసిస్‌ ఎదుర్కొన్నాడు. కాకపోతే ఉమేశ్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డుప్లెసిస్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆపై హమ్జా-బావుమాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జా(62), బావుమా(32)లు వెంట వెంటనే ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా పతనం తిరిగి ప్రారంభమైంది. క్లాసెన్‌(6), పీయడ్త్‌(4), రబడా(0)లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.

లంచ్‌ తర్వాత సఫారీ ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు సాగలేదు. లిండే(37;81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌)చాలాసేపు ప్రతిఘటించాడు. అతనికి నోర్జే నుంచి సహకారం లభించింది. వీరిద్దరూ సుమారు 18 ఓవర్లు క్రీజ్‌లో ఉన్నారు. కాగా, లిండే తొమ్మిదో వికెట్‌గా ఔటైన తర్వాత నోర్జే(4; 55 బంతులు) చివరి వికెట్‌గా ఔటయ్యాడు. నదీమ్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్‌, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు