ఇదేం జట్టురా నాయనా..!

5 Dec, 2018 21:37 IST|Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై వారివారి దేశాల్లోనే సిరీస్‌లు నెగ్గిన టీమిండియాకు ఆస్ట్రేలియా మాత్రం కొరకరాని కొయ్యగా మిగిలింది. సుమారు ఏడు దశాబ్దాల క్రికెట్‌ చరిత్రలో ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలన్న భారత అభిమానుల కోరిక మాత్రం నెరవేరటం లేదు. అయితే పలు వివాదాల కారణంగా ఆసీస్‌ బలహీనపడటం.. యువ, సీనియర్‌ ఆటగాళ్లతో భారత జట్టు బలంగా ఉండటంతో ఈ సారైనా సిరీస్‌ గెలుస్తుందని అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.  

కంగారులను వారి గడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ గెలవాలని విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఆసీస్‌లో అడుగుపెట్టింది. గురువారం నుంచి ఆడిలైడ్‌ వేదికగా టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌తో తొలి టెస్టు కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టును టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ప్రస్తుతం ట్విటర్‌ వేదికగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపికపై మండిపడుతున్నారు. జట్టు కూర్పు సరిగా లేదంటూ మండిపడుతున్నారు. ఫ్యాన్స్‌ ముఖ్యంగా తరుచుగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ను తప్పించి రోహిత్‌ను ఓపెనర్‌గా పంపించాలని కోరుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా సెటిల్‌ అయిన రోహిత్‌ను టెస్టుల్లో కూడా ఓపెనింగ్‌కు పంపించాలని కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక బౌలింగ్‌ ఎంపికపై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. స్వింగ్‌ కింగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. టీ20ల్లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేసిన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించి అశ్విన్‌ను తీసుకోవడం పట్ల కూడా ఫ్యాన్స్‌ గుస్సవుతున్నారు. ఇక హనుమ విహారిని తీసుకుంటే పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా కూడా ఉపయోగపడతాడరని సూచనలిస్తున్నారు. టీమిండియా గెలవడానికి ఆడుతుందా? లేకుంటే డ్రా చేసుకోవడానికి? ఇదేం జట్టు సెలక్షన్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు