‘ధోనిని ఔట్‌ చేసింది రాహులే‌’

26 Sep, 2018 11:41 IST|Sakshi

దుబాయ్‌: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్‌- టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌ టై గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే విజయం టీమిండియాదే అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఓటమి అంచులదాకా వెళ్లి స్కోర్‌ సమంచేసి ‘టై’ తో సంతృప్తి పడింది. అయితే మ్యాచ్‌ టై కావడానికి, ధోని ఔట్‌ కావడానికి ఓపెనర్‌ కేఎల్‌ రాహులే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాహుల్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు కదా, మరి ఫ్యాన్స్‌ ఎందుకు విమర్శిస్తున్నారనుకుంటున్నారా.. రివ్యూను వృథా చేయడమే రాహుల్‌ చేసిన పొరపాటు. అఫ్గాన్ సంచలన బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి రాహుల్‌ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే దీనిపై అనుమానంగానే రివ్యూకి వెళ్లాడు. కానీ క్లియర్‌గా రాహుల్‌ ఔటైనట్లు థర్డ్‌ అంపైర్‌ ప్రకటించడంతో భారత్‌ ఉన్న ఒక్క రివ్యూ కోల్పోయింది. 

అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అహ్మదీ బౌలింగ్‌లో అంపైర్‌ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. అయితే అంపైర్‌ నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికి రివ్యూ లేకపోవడంతో ధోని మైదానాన్ని వీడాల్సివచ్చింది. అయితే రివ్యూ మిగిలివుంటే ధోని అవుటయ్యేవాడు కాదని, మ్యాచ్‌ టై గా ముగిసేది కాదని అభిమానుల వాదన. అయితే ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ రివ్యూ సరిగ్గా ఉపయోగించకుండా వృథా చేశాడని నెటిజన్లు గుర్తుచేశారు. రాహుల్‌ డీఆర్‌ఎస్‌ ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడని, దీనిపై అతడికి ధోనితో ప్రత్యేక క్లాస్‌లు చెప్పించాలని కామెంట్‍ చేస్తున్నారు. ఎంఎస్‌ ధోని 200వ వన్డేకు నాయకత్వం వహిస్తున్న మ్యాచ్‌ గెలవకుండా అడ్డుకుంది రాహులే అని మరికొంతమంది ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒక్క రివ్యూ తప్పిదంతో ఇద్దరు ఔటయ్యారంటూ చురకలు అంటిస్తున్నారు.

చదవండి:
ఊరించి... ఉత్కం‘టై’

మరిన్ని వార్తలు