అతడు క్రికెట్‌ సూపర్‌స్టార్‌

12 Dec, 2019 16:43 IST|Sakshi

డిసెంబర్‌ 12 వచ్చిందంటే అటు సినీ అభిమానులకు.. ఇటు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే. ఎందుకంటే డిసెంబర్‌ 12న ఇద్దరు సూపర్‌స్టార్‌ల బర్త్‌డే. సినిమా రంగంలో సరికొత్త స్టైల్‌ను ప్రజెంట్‌ చేసి విదేశాల్లో సైతం అభిమానులను సొంతం చేసుకుని భారత సినిమా ఖ్యాతిని ఖండాంతరాల దాటించిన రీల్‌ సూపర్‌ స్టార్‌ ఒకరు కాగా.. మైదానంలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టించి దేశం గర్వించే విజయాలను అందించిన రియల్‌ సూపర్‌ స్టార్‌ మరొకరు. రీల్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కాగా, రియల్‌ సూపర్‌ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌.

ఈ రోజు ఎవరి వాట్సప్‌ స్టేటస్‌ చూసినా, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా స్టోరీలు ఓపెన్‌ చేసినా ఈ ఇద్దరి సూపర్‌ స్టార్‌లే కనిపిస్తున్నారు. తమ అభిమాన హీరోలా బర్త్‌డే సందర్బంగా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తలైవాకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. అదేవిధంగా దేశ, విదేశ క్రికెటర్లతో పాటు ఐసీసీ, బీసీసీఐలు యువరాజ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపాయి. టీమిండియా టీ20, వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆనాటి స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గురించి ప్రత్యేక కథనం. (చదవండి: మూడేళ్లు కాదు.. 30 ఏళ్లు)


పంజాబ్‌కు చెందిన యోగ్‌రాజ్‌- షబ్నమ్‌ సింగ్‌ దంపతులకు 1981, డిసెంబర్‌ 12న యువరాజ్‌ సింగ్‌ జన్మించాడు. చిన్నప్పట్నుంచి యువీకి క్రికెట్‌పై ఉన్న మక్కువను గమనించిన యోగ్‌రాజ్‌ అతడికి క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు. 1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007,2011 ప్రపంచకప్‌ల్లో యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్‌ సృష్టించాడు. 


మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు నమోదు చేశాడు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల కింగ్‌.. చివరి వన్డేను 2017 వెస్టిండీస్‌తో ఆడాడు.  2003లో టెస్టుల్లో న్యూజిలాండ్‌తో అరంగేట్రం చేసిన యువీ 2012లో ఇంగ్లండ్‌పై తన చివరి టెస్ట్‌ను ఆడగా, ఇక చివరి అంతర్జాతీయ టీ20 ఇంగ్లండ్‌పై 2017లో ఆడాడు.

ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో బంతితో మెరిసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు.  ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ.. ప్రపంచకప్‌ అనంతరం అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. ఈ చికిత్స అనంతరం యువీ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా, ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. (‘అతడ్ని వదిలిపెట్టాం.. నిన్ను తీసుకుంటాం’) 


టీమిండియాలో  స్టైలీష్‌ ప్లేయర్‌గా యువీకి మంచి గుర్తింపు ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో యువీ ప్రత్యేక మ్యానరిజం, స్టైల్‌ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కవర్‌డ్రైవ్‌ షాట్‌లకు యువరాజ్‌ పెట్టింది పేరు. యువీ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడాడంటే దానిని రిప్లైలో పది సార్లు చూసినా మనసుతీరదు. అదేవిధంగా కూర్చొని సిక్సర్‌ కొట్టే విధానం, వికెట్‌ తీసినప్పుడు ఎగిరి గంతేసే విధానం అన్ని యువీకే సొంతం. అందుకే అతడిని స్టైలీష్‌ క్రికెటర్‌గా అభిమానులు పేర్కొంటారు. అంతేకాకుండా అతడిని క్రికెట్‌ సూపర్‌ స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌ సంబోధిస్తుంటారు.   (మరొక యువరాజ్‌ దొరికాడోచ్‌..!)

యువీ తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. అన్నింటికి మించి ఎంతో మంది టీమిండియా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ టీమిండియాలో లెఫ్టాండ్‌ బ్యాటింగ్‌ చేసే బ్యాట్స్‌మన్‌ను చూస్తే అందరి మెదళ్లలో యూవీనే మెదులుతాడంటే అతిశయోక్తికాదు. ఇక 2012లో భారత ప్రభుత్వం క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుతో, 2014లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.
 

సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ బర్త్‌డే సందర్భంగా పలువురు చేసిన ట్వీట్‌లు..

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై బ్రాడ్‌ వేసిన ఒకే ఓవర్‌లో యువీ కొట్టిన ఆరు సిక్సర్లకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘6 6 6 6 6 6 హ్యాపీ బర్త్‌డే యువరాజ్‌ సింగ్‌’అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది.  

‘A B C D E F G H I J K L M  N O P Q R S T U V W X Y Z.. ఇలా ఎన్నో ఉన్నా UV ఎంతో ప్రత్యేకం, చాలా అరుదు. కఠిన పరిస్థితుల్లో పోరాటానికి ఎల్లప్పుడూ ముందుంటావు. హ్యాపీ బర్త్‌డే యువరజా సింగ్‌’అంటూ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. 

‘యువీ నువ్వు అసలైన చాంపియన్‌వి. ఎంతో మంది యువతకు స్పూర్థివి. హ్యపీ బర్త్‌డే యువరాజ్‌’- బీసీసీఐ.

‘హ్యపీ బర్త్‌డే సూపర్‌ స్టార్‌. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’- సచిన్‌ టెండూల్కర్‌.

‘సిక్సర్ల వీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ - ముంబై ఇండియన్స్‌

మరిన్ని వార్తలు