టీమిండియా కావాలనే ఓడిపోయిందట!

3 Jun, 2020 20:42 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీలు కొత్త పల్లవి

అప్పుడే విండీస్‌ క్రికెటర్లు చెప్పారు: అహ్మద్‌

కరాచీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా కావాలనే ఓడిపోయిందని అంటున్నాడు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌. బెన్‌స్టోక్స్‌ తన తాజా పుస్తకం ‘ఆన్‌పైర్‌’లో భారత్‌తో మ్యాచ్‌లో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయని ప్రస్తావించడంతో అది కాస్తా సరికొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ సికిందర్‌ బక్త్‌ విమర్శలు సంధించగా, తాజాగా ఆ జాబితాలో రజాక్‌ చేరిపోయాడు. ‘వరల్డ్‌కప్‌ లీగ్‌ దశలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్‌.. ఎందుకు ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ మేము చూశాం. ఒక జట్టు నాకౌట్‌కు క్వాలిఫై కాకూడదనే ఉద్దేశంతోనే టీమిండియా అలా చేసింది. అందులో అనుమానమేమీ లేదు. ఒక క్వాలిటీ బౌలర్‌ బౌలింగ్‌ సరిగా వేయలేదు. కావాలనే లైన్‌ తప్పాడు. పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత భారత్‌ పరుగుల వేటలో వెనుకబడింది. ఫోర్లు, సిక్స్‌లు కొట్టాల్సిన సమయంలో డిఫెన్స్‌ ఆట మొదలు పెట్టింది. ఇవన్నీ అప్పుడే అనుమానాలకు తావిచ్చాయి. ఇప్పుడు స్టోక్స్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు’ అని రజాక్‌ విమర్శించాడు.(‘భారత్‌ ఓడిపోతుందని అనలేదు’)

దీనిపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ కూడా ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేశాడు. తనకు వెస్టిండీస్‌ క్రికెటర్లు ఈ విషయాన్ని చెప్పారన్నాడు. పాకిస్తాన్‌ను నాకౌట్‌కు చేరకుండా చేయడానికి భారత్‌ ఓడిపోయిందని కొంతమంది విండీస్‌ క్రికెటర్లు చెప్పారన్నాడు. వారిలో జేసన్‌ హోల్డర్‌, క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రసెల్‌ ఉన్నట్లు ముస్తాక్‌ అహ్మద్‌ తెలిపాడు. గత వరల్డ్‌కప్‌లో తాను విండీస్‌ క్రికెట్‌తో పని చేసిన సమయంలో ఈ విషయాన్ని వారు తెలిపారన్నాడు. ఓ పాకిస్తాన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ భారత్‌ కావాలని ఓడిపోయిందంటూ కొత్త రాగం అందుకున్నారు. గతేడాది ఇంగ్లండ్‌తో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 337 పరుగులు చేయగా, భారత్‌ 306 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.  ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(102), కోహ్లి(66), రిషభ్‌ పంత్‌(32), హార్దిక్‌ పాండ్యా(45), ఎంఎస్‌ ధోని(42 నాటౌట్‌)లు రాణించినా భారీ లక్ష్యం కావడంతో జట్టును గెలిపించలేకపోయారు. చివరి వరకూ ధోని క్రీజ్‌లో ఉన్నా భారత్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.(‘మేము ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లం’)

మరిన్ని వార్తలు