ధోని డకౌట్: ఎదురీదుతున్నటీమిండియా

17 Aug, 2014 20:30 IST|Sakshi
ధోని డకౌట్: ఎదురీదుతున్నటీమిండియా

ఓవల్:ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది. ఆదివారం మూడోరోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తొలి 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. కాసేపు ఫర్వాలేదనిపించింది. అయితే భారత్ స్కోరు బోర్డు 30 పరుగులు చేరే సరికి మూడో వికెట్టును కోల్పోయింది. అనంతరం మరో 16 పరుగులు జోడించి మరో రెండు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 46 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత్ ఓపెనర్లు మురళీ విజయ్(2), గంభీర్ (3)పరుగులకే  పెవిలియన్ కు చేరగా,  పూజారా(11), రహానే(4), పరుగుల వద్ద నిష్క్రమించారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(0) డకౌట్ గా వెనుదిరిగా భారత ఆశలపై నీళ్లు చల్లాడు.క్రీజ్ లో కోహ్లి(19), బిన్నీ(2) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్ కు రెండు వికెట్లు లభించగా,బ్రాడ్, వాక్స్ కు తలో వికెట్టు దక్కాయి.

 

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 385 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో వంద పరుగులు పైగా జోడించి ఇన్నింగ్స్ ను 486 పరుగుల వద్ద ముగించింది.  దీంతో ఇంగ్లండ్ కు 338 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ చివరి వరసు ఆటగాళ్లు జోర్డాన్ (20), బ్రాడ్(37) పరుగులు జోడించి జట్టు భారీ పరుగులు చేయడంలో తోడ్పడ్డారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు