స్వయంకృతం

23 Feb, 2018 00:17 IST|Sakshi
భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

అనూహ్యంగా చేజారిన రెండో టి20

వాతావరణమూ కొంత కారణమే

సాక్షి క్రీడా విభాగం : తరిమిన మేఘావృత వాతావరణం...  చేజారిన కొన్ని అవకాశాలు...  కీలక సమయంలో నిర్ణయ లోపాలు...  ప్రత్యర్థి జట్టులో ఓ అద్భుత భాగస్వామ్యం...  సెంచూరియన్‌ పిచ్‌పై సరిపడా పరుగులు చేసినా రెండో టి20లో భారత్‌ ఓడిపోవడానికి కారణాలివే! ఇప్పుడో అప్పుడో వాన కురుస్తుందేమో అన్న ఊగిసలాట మధ్య సాగిన ఆటలో ప్రొటీస్‌ది పైచేయి కావడానికీ ఇవే ఆస్కారమిచ్చాయి. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ వరకు వర్షం వెంటాడింది. దీంతో ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ లెక్కలు బయటకు వచ్చాయి. తొలుత దక్షిణాఫ్రికా దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆడింది. అలా వర్తింపజేసినా గెలుపు మనవైపే ఉంది. ఎప్పుడైతే వాన ముప్పు తప్పిందో... అప్పుడే మరో ప్రమాదం క్లాసెన్‌ రూపంలో ముంచుకొచ్చింది. నాలుగో వన్డేలో మన జట్టు జోరును సైంధవుడిలా అడ్డుకున్న ఈ సఫారీ వికెట్‌ కీపర్‌ ఈసారి టి20లో సరిగ్గా అదే పాత్ర పోషించాడు. ఒక్కసారిగా విరుచుకుపడి సమీకరణాలు మార్చేశాడు. 

ఆరంభం మనదే అయినా... 
186... సెంచూరియన్‌లో టి20ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్ల సగటు స్కోరిది. టీమిండియా దీనికి రెండు పరుగులు అదనంగానే చేసింది. భువనేశ్వర్, శార్దుల్‌ ప్రారంభ ఓవర్ల బౌలింగ్, ఓపెనర్లు త్వరగా వెనుదిరగడం చూస్తే ప్రత్యర్థికి ఛేదన కష్టమే అనిపించింది. అయితే, వచ్చీరావడంతోనే రెండు సిక్స్‌లు కొట్టిన క్లాసెన్‌... తర్వాత స్పిన్నర్‌ చహల్‌ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాడు. అతడు వేసిన 13వ ఓవర్లో విశ్వరూపం చూపాడు. దీంతో అప్పటిదాకా 10కి పైగా ఉన్న సాధించాల్సిన రన్‌రేట్‌ 8కి పడిపోయింది. వెంటనే క్లాసెన్‌ వెనుదిరిగినా... అప్పటికే చేయాల్సినంత నష్టం చేసేశాడు. తర్వాత డుమిని కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో పని పూర్తిచేశాడు. 

లోటు కనిపించింది... 
ప్రభావం చూపని ఉనాద్కట్‌ బౌలింగ్‌తో పాటు, ప్రధాన పేసర్‌ బుమ్రా లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. క్లిష్టమైనదైనా... డుమిని స్టంపౌంట్‌ (16వ ఓవర్‌లో)ను ధోని చేజార్చాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోని చేతిలో ఇలా జరగడం ఊహించనిదే. ఇక ఒత్తిడిలో కెప్టెన్‌ కోహ్లి సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. రైనా వంటి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించకుండా.., గాలిలో తేమ కారణంగా బంతిపై పట్టు చిక్కక ఇబ్బంది పడుతూ, ఓవర్‌కు 15పైగా పరుగులిస్తూ, రెండుసార్లు రనప్‌ విరమించుకున్న చహల్‌నే కొనసాగించాడు. రైనా ఒక్క ఓవరే వేసి ఏడెనిమిది పరుగులిచ్చినా కొంతలో కొంత నయంగా ఉండేది. పేలవ సారథ్యం అంటూ దీనిపై వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో భువనేశ్వర్‌ను కాదని ఉనాద్కట్‌కు బంతినివ్వడమూ సరైనదిగా అనిపించలేదు. భువీ 19వ ఓవర్‌ వేసి కట్టడి చేసి ఉంటే... ఒత్తిడిలో చేతులెత్తేసే లక్షణమున్న దక్షిణాఫ్రికాకు చివరి  ఓవర్లో పరీక్ష ఎదురయ్యేది. తద్వారా ఆశలు నిలిచి ఏదైనా జరిగేందుకు 
అవకాశం చిక్కేది. 

అసహనం బయటకొచ్చింది... 
సెంచూరియన్‌లో రెండుసార్లు భారత ఆటగాళ్ల సహనానికి పరీక్ష ఎదురైంది. బ్యాటింగ్‌ సందర్భంగా చివరి ఓవర్‌లో రెండో పరుగుకు రాని మనీశ్‌పాండేపై ధోని ఆగ్రహం చూసినవారంతా ఆశ్చర్యపోయారు. మిస్టర్‌ కూల్‌గా పేరున్న ధోని... పాండేను పరుష పదజాలంతో దూషించినట్లు కనిపించింది. వేగంగా త్రో విసరనందుకు ఉనాద్కట్‌పై పాండ్యా విసురును ప్రదర్శించగా, కోహ్లి సైతం కఠిన పదాలు ప్రయోగించాడు. 

బౌలర్లు ఇబ్బందిపడ్డారు
మేం 175 పరుగులే చేయగలమనుకున్నా. రైనా, మనీశ్, ధోని అద్భుతంగా ఆడటంతో 190కి చేరువయ్యాం. ఇది గెలిచే స్కోరే. వాతావరణంతో బౌలర్లకు ఇబ్బంది ఎదురైంది. చినుకుల కారణంగా 13వ ఓవర్‌ నుంచి బంతిపై పట్టు చిక్కలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌దే ఘనతంతా. రిస్క్‌ తీసుకుంటూనే క్లాసెన్, డుమిని బాగా ఆడారు. ఆ జట్టు నుంచి ఇలాంటి ప్రతిఘటననే మేం ఆశిస్తున్నాం. ప్రేక్షకుడి కోణంలో ఇది మంచి మ్యాచ్‌.  
– భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

చహల్‌ను లక్ష్యంగా చేసుకున్నా
భారత పేసర్లు బాగా బౌలింగ్‌ చేశారు. దీంతో చహల్‌పై దృష్టిపెట్టా. దీనికోసం ప్రత్యేక ప్రణాళికేమీ వేసుకోలేదు. కెరీర్‌ ఆరంభంలో అమెచ్యూర్‌గా నాణ్యమైన లెగ్‌స్పిన్నర్లను ఎదుర్కొనడం ఇక్కడ పనికొచ్చింది. ఓవర్‌ ఓవర్‌కు లక్ష్యం పెట్టుకుని ఆడా. నా ఇన్నింగ్స్‌కు ముఖ్య కారణం కెప్టెన్‌ డుమిని. అతడు నాలో భయాన్ని పోగొట్టాడు. సహజంగా ఆడమని సూచించాడు. చినుకుల వర్షంతో మారిన వాతావరణం కూడా మేలు చేసింది. సొంత మైదానంలో దేశానికి ఆడుతూ జట్టును గెలిపించాలని చిన్నప్పుడు అనుకుంటాం. అదిప్పుడు నిజమైంది. 
– దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ క్లాసెన్‌  

మరిన్ని వార్తలు