అదే కథ...అదే వ్యథ

12 Aug, 2018 22:30 IST|Sakshi
బ్రాడ్‌ బౌలింగ్‌లో పుజారా క్లీన్‌బౌల్డ్‌

లార్డ్స్‌ టెస్టులో భారత్‌ ఘోర పరాజయం

ఇన్నింగ్స్, 159 పరుగులతో చిత్తుగా ఓడిన కోహ్లి బృందం

బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలం

అండర్సన్, బ్రాడ్‌లకు చెరో 4 వికెట్లు

18 నుంచి మూడో టెస్టు

తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లు... ఇప్పుడు 47 ఓవర్లు... మొదటి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు... ఈసారి 130కి ఆలౌట్‌... అదనపు ఓవర్లు, మరికొన్ని పరుగులు మినహా మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌... రెండో టెస్టులో భారత జట్టు ఆట, రాత ఏమీ మారలేదు. మరోసారి బ్యాట్స్‌మెన్‌ ఘోర ప్రదర్శన టీమిండియాకు విదేశీ గడ్డపై మరో పరాభవాన్ని మిగిల్చింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బ్యాటింగ్‌కు పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నా మనోళ్లు కనీస పట్టుదల కనబర్చలేకపోయారు... కాస్త గట్టిగా నిలబడితే ఆపై వరుణుడు అండగా నిలిచేవాడేమో కానీ అదీ జరగలేదు. తొలి రోజు వర్షంతో కోల్పోయిన పూర్తి ఆటను మినహాయిస్తే మూడు రోజుల్లోపే మ్యాచ్‌ ముగిసినట్లు. నంబర్‌వన్‌ హోదాలో ఎంతో ఉత్సాహంతో ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టిన కోహ్లి సేన 0–2తో వెనుకబడి ఇక కోలుకోగలదా! 
 
లండన్‌: అనూహ్యం ఏమీ జరగలేదు... మ్యాచ్‌ మూడో రోజే భారీ ఆధిక్యం కోల్పోయి ఆశలు కోల్పోయిన భారత జట్టు ఆదివారం కూడా బ్యాటింగ్‌లో కుప్పకూలింది. ఫలితంగా రెండో టెస్టులో చిత్తుగా ఓడింది. లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు వెనుకబడిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (48 బంతుల్లో 33 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ చెరో 4 వికెట్లతో భారత్‌ను కుప్పకూల్చగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ వోక్స్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 18 నుంచి నాటింగ్‌హామ్‌లో మూడో టెస్టు జరుగుతుంది.  

తీరు మారలేదు...
తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోయిన భారత జట్టుకు రెండో ఇన్నింగ్స్‌ కూడా ఏమాత్రం కలిసి రాలేదు. ఇంగ్లండ్‌ పేసర్ల ధాటికి మన బ్యాట్స్‌మెన్‌ మరోసారి దాసోహమయ్యారు. ఆరంభంలో అండర్సన్‌ తన వంతు పాత్ర పోషించగా, ఆ తర్వాత బ్రాడ్‌ చెలరేగాడు. అండర్సన్‌ దెబ్బకు విజయ్‌ (0) మళ్లీ డకౌట్‌ ‘పెయిర్‌’గా వెనుదిరగ్గా... రాహుల్‌ (10) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో పుజారా, రహానే పరుగులు చేయలేకపోయినా కొద్ది సేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే బ్రాడ్‌ బౌలింగ్‌ భారత్‌ను దెబ్బ తీసింది.

దూరంగా వెళుతున్న బంతికి వెంటాడి రహానే (13) స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వగా, అప్పటి వరకు ఎంతో ఓపిగ్గా ఆడిన పుజారా (87 బంతుల్లో 17; 1 ఫోర్‌) చక్కటి ఇన్‌స్వింగర్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు. కొద్ది సేపటికి బ్రాడ్‌ వేసిన మరో ఓవర్‌ భారత్‌ పరిస్థితిని దిగజార్చింది. షార్ట్‌లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చి కోహ్లి (17) వెనుదిరగ్గా, తర్వాతి బంతికే దినేశ్‌ కార్తీక్‌ (0) పెవిలియన్‌ చేరాడు. తన 7 ఓవర్ల స్పెల్‌లో బ్రాడ్‌ 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. ఈ దశలో పాండ్యా, అశ్విన్‌ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. పేసర్ల దెబ్బలను ఓర్చుకుంటూ వీరిద్దరు కొద్దిసేపు పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. అయితే పాండ్యాను వోక్స్‌ ఔట్‌ చేయగా...కుల్దీప్‌ (0), షమీ (0) వికెట్లు అండర్సన్‌ ఖాతాలో చేరాయి.

ఆ తర్వాత ఇషాంత్‌ (2)ను కూడా వోక్స్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ పోరు ముగిసింది.  అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన  ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ వోక్స్, కరన్‌ (49 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చకచకా పరుగులు జోడించారు. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ 7.1 ఓవర్లలో 39 పరుగులు చేసింది. షమీ వేసిన ఓవర్లో ఆ జట్టు 2 ఫోర్లు, సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టింది. అయితే హార్దిక్‌ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్‌ తొలి బంతికే భారీ షాట్‌ ఆడబోయి కరన్‌ వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 396/7 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.  

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 107;
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 396/7 డిక్లేర్డ్‌;
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మురళీ విజయ్‌ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 0; లోకేశ్‌ రాహుల్‌ (ఎల్బీ) (బి) అండర్సన్‌ 10; పుజారా (బి) స్టువర్ట్‌ బ్రాడ్‌ 17; రహానే (సి) జెన్నింగ్స్‌ (బి) స్టువర్ట్‌ బ్రాడ్‌ 13; విరాట్‌ కోహ్లి (సి) పోప్‌ (బి) స్టువర్ట్‌ బ్రాడ్‌ 17; హార్దిక్‌ పాండ్యా (ఎల్బీ) (బి) వోక్స్‌ 26; దినేశ్‌ కార్తీక్‌ (ఎల్బీ) (బి) స్టువర్ట్‌ బ్రాడ్‌ 0; అశ్విన్‌ (నాటౌట్‌) 33; కుల్దీప్‌ యాదవ్‌ (బి) అండర్సన్‌ 0; షమీ (ఎల్బీ) (బి) అండర్సన్‌ 0; ఇషాంత్‌ (సి) పోప్‌ (బి) వోక్స్‌ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్‌) 130.  

వికెట్ల పతనం: 1–0; 2–13; 3–35; 4–50; 5–61; 6–61; 7–116; 8–121; 9–125; 10–130. 
బౌలింగ్‌: అండర్సన్‌ 12–5–23–4; స్టువర్ట్‌ బ్రాడ్‌ 16–6–44–4; క్రిస్‌ వోక్స్‌ 10–2–24–2; కరన్‌ 9–1–27–0.  
 

► 1 కోహ్లి సారథ్యంలో భారత్‌ తొలిసారి ఓ టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయింది. 2014 ఓవల్‌ టెస్టులో (ఇన్నింగ్స్‌ 244 పరుగులు) తర్వాత భారత్‌కిదే తొలి ఇన్నింగ్స్‌ పరాజయం.
► 2 గ్యారెత్‌ బ్యాటీ (బంగ్లాదేశ్‌పై లార్డ్స్‌లో 2005లో) తర్వాత ఇంగ్లండ్‌ తుది జట్టులో సభ్యుడిగా ఉండి బౌలింగ్‌ చేసే అవకాశం, బ్యాటింగ్‌ చేసే అవకాశం, క్యాచ్‌ కూడా పట్టని రెండో ఇంగ్లండ్‌ ప్లేయర్‌గా ఆదిల్‌ రషీద్‌ గుర్తింపు పొందాడు.  
► 1 భారత్‌ తరఫున ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ (29; 33 నాటౌట్‌) ఘనత వహించాడు. 
► 6 రెండు ఇన్నింగ్స్‌లలో సున్నాకే ఔటైన ఆరో భారత బ్యాట్స్‌మన్‌ విజయ్‌
► 5 మ్యాచ్‌లో ఆడిన మొత్తం ఓవర్లపరంగా చూస్తే భారత్‌కు ఇది ఐదో (82.2) చెత్త ప్రదర్శన.


 ఆనందంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

మరిన్ని వార్తలు