అసభ్య ప్రవర్తన.. టీమిండియా మేనేజర్‌పై వేటు!

14 Aug, 2019 20:06 IST|Sakshi
ఫైల్‌ఫోటో

ట్రినిడాడ్‌: కరీబియన్‌ దీవుల్లోని భారత హై కమిషన్‌ అధికారుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ సునీల్‌ సుబ్రమణ్యం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తక్షణమే వెస్టిండీస్‌ నుంచి వెనక్కు వచ్చేయమంటూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అతడికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జల సంరక్షణపై కోహ్లి సేనతో వీడియో షూట్‌ నిర్వహించేలా సహకరించమని కోరుతూ గయానా, ట్రినిడాడ్‌–టొబాగో దేశాల్లోని ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) సీనియర్‌ అధికారి ఒకరు సుబ్రమణ్యంను ఫోన్‌లో సంప్రదించారు. పలుసార్లు ప్రయత్నించినా అతడు సరిగా స్పందించలేదు.

చివరకు ‘సందేశాలతో ముంచెత్తకండి’ అంటూ జవాబిచ్చాడు. ఈ విషయం ప్రభుత్వ ఉన్నత వర్గాలకు చేరింది. వారు తీవ్రంగా పరిగణించ డంతో బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. సుబ్రమణ్యం త్వరలో బోర్డు సీఈవో రాహుల్‌ జోహ్రిని కలసి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అతడు బేషరతుగా క్షమాపణ కోరాడు. నిద్ర లేమి, ఒత్తిడి కారణంగా ఇలా జరిగిందంటూ చెప్పుకొచ్చాడు. 52 ఏళ్ల సుబ్రమణ్యం తమిళనాడుకు చెందినవాడు. 74 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 285 వికెట్లు తీశాడు.

టీమిండియా టెస్టు ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాజీ కోచ్‌. భారత జట్టు కోచింగ్, సహాయ బృందం ఎంపికకు ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌గా సుబ్రమణ్యం పేరు షార్ట్‌లిస్ట్‌లో ఉంది. కాగా, సుబ్రమణ్యం ప్రవర్తనపై ఇప్పటికే బీసీసీఐకి పలుసార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. 2018లో కోహ్లీ సేన ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన పర్యటనలో అక్కడి అధికారుల తోనూ, ప్రపంచకప్‌ సమయంలోనూ బోర్డు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. దీనిపై అప్పట్లో ఆయన సులువుగా వేటు తప్పించుకున్నాడు.  

మరిన్ని వార్తలు