టాప్ గేర్ లో టీమిండియా

14 Mar, 2015 18:55 IST|Sakshi
టాప్ గేర్ లో టీమిండియా

ఆక్లాండ్: ఓటమే లేకుండా గ్రూప్ బి నుంచి టాపర్ గా కొనసాగుతున్న టీమిండియా టాప్ గేర్ లో కొనసాగుతోంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి ఈ వరల్డ్ కప్ లో ఆరో విజయాన్ని సాధించింది. దీంతో గ్రూప్ ఏ టాపర్ గా ఉన్న న్యూజిలాండ్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా ధోనీ సేన ఖాతాలో పది వరుస వరల్డ్ కప్ విజయాలు చేరాయి. అంతకుముందు 2007 లో జరిగిన వరల్డ్ కప్ లో ధోనీ అండ్ గ్యాంగ్ వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

2003 ఈవెంట్లో గంగూలీ సేన అత్యధికంగా 8 వరుస విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. తాజా ఈవెంట్లో ధోనీసేన ఇప్పటికే ఆ రికార్డును దాటి మరో విజయాన్ని నమోదు చేసుకుని స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్ లో పేలవమైన ఫామ్ ను కొనసాగించిన టీమిండియా.. వరల్డ్ కప్ కు వచ్చేసరికి దూసుకుపోతుంది. ప్రత్యర్థి చిన్న జట్టా?పెద్ద జట్టా?అనేది పక్కన పెట్టి టీమిండియా తన పంచ్ పవర్ చూపిస్తోంది.  తొలుత పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వేలపై ఘనవిజయాలు నమోదు చేసింది. గ్రూప్ బి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా మార్చి 19 వ తేదీన జరిగే రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.

మరిన్ని వార్తలు