ఇద్దరికీ అరంగేట్రపు వన్డే.. కానీ

5 Feb, 2020 08:27 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న  తొలి వన్డేలో టీమిండియా తొలి పది ఓవర్లలోపే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌ ద్వారా వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. పృథ్వీ షా 21 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, మయాంగ్‌ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ గ్రాండ్‌ హోమ్‌ వేసిన 8వ ఓవర్‌ ఆఖరి బంతికి పృథ్వీషా వికెట్‌ను సమర్పించుకోగా, సౌతీ వేసిన 9వ ఓవర్‌ నాల్గో బంతికి మయాంగ్‌ పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ జట్టుకు కాస్త శుభారంభాన్ని అందించినా వాటిని భారీ స్కోర్లగా మార్చడంలో విఫమయ్యారు. గ్రాండ్‌ హోమ్‌ ఆఫ్‌ స్టంప్‌పైకి వేసిన బంతిని టచ్‌ చేసి కీపర్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పృథ్వీ షా మైదానం వీడితే, మయాంక్‌ స్వ్కేర్‌ కట్‌ ఆడబోయి పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న బ్లండెల్‌ క్యాచ్‌ పట్టడంతో వికెట్‌ కోల్పోయాడు. 11 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు 60 పరుగులు చేసింది.

తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్‌ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రోహిత్‌ కాలిపిక్క కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఆపై రోహిత్‌ను బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, అతనికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఫిజియో సూచించారు. దాంతో మొత్తం న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ఆ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు.  ఇక ముందుగానే వన్డే జట్టులో పృథ్వీ షా అవకాశం దక్కించుకోవడంతో మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఇది వన్డే కాబట్టి కీపర్‌గా కూడా కేఎల్‌ రాహుల్‌ బాధ్యతలు మోయాల్సి ఉండటంతో అతన్ని మిడిల్‌ ఆర్డర్‌లో పంపించనున్నారు.

మరిన్ని వార్తలు