-

స్టీవ్ వా, పాంటింగ్ లు కెప్టెన్సీ చేసినా..

24 Sep, 2017 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ:ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టును ఓడించడం ఆస్ట్రేలియా వల్ల కాదని అంటున్నాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇరు జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 5-0తో సిరీస్ ను కైవసం చేసుకోవడం ఖాయమని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. ఒకవేళ ఆసీస్ దిగ్గజ కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ లు కెప్టెన్సీ చేసినా ప్రస్తుత భారత జట్టును ఓడించడం వారి వల్ల కాదని సెహ్వాగ్  అన్నాడు.

'ప్రస్తుత టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. అదే సమయంలో ఆసీస్ క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. వన్డే సిరీస్ భారత్ వైట్ వాష్ చేయడం ఖాయం. భారత పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టుకు స్టీవ్ వా, రికీ పాంటింగ్ సారథులుగా వ్యవహరించినా ఆ జట్టు పేలవప్రదర్శనను మాత్రం ఆపలేరు. ఆసీస్ జట్టులో పోరాట స్ఫూర్తి అస్సలు లేదు. దానికి తగ్గట్టే బలహీనంగా ఉంది. ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేయడం భారత్ కు ఎంతమాత్రం కష్టం కాదు. అదే జరుగుతుందని ఆశిస్తున్నా'అని సెహ్వాగ్ తెలిపాడు. ఆసీస్ జట్టులో  ఒక కౌల్టర్ నైల్ తప్ప మిగతా బౌలర్లంతా అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నారన్నాడు. ఇక బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్ వెల్ ను తొందరగా అవుట్ చేస్తే ఇక ఆ జట్టు తేరుకోవడం కష్టమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు