శతకోటి ఆశలతో... 

23 May, 2019 00:31 IST|Sakshi

బ్రిటిష్‌ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా

25న తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌   

లండన్‌: వరల్డ్‌ కప్‌లో విజయమే లక్ష్యంగా... భారత అభిమానుల ‘బెస్ట్‌ విషెస్‌’ తోడుగా ముంబై నుంచి బయల్దేరిన కోహ్లి సేన బుధవారం బ్రిటిష్‌ గడ్డపై అడుగు పెట్టింది. 15 మంది ఆటగాళ్లతో పాటు మరో 14 మంది సహాయక సిబ్బంది సహా మొత్తం 29 మంది సభ్యుల బృందం సుమారు పది గంటల ప్రయాణం తర్వాత లండన్‌కు చేరుకుంది. విశ్రాంతి అనంతరం గురు, శుక్రవారాల్లో భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. గత ఏడాది జులైలో ఇక్కడే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో నలుగురు మినహా మిగతా వారంతా ప్రస్తుత వరల్డ్‌ కప్‌ జట్టులో ఉన్నారు. వీరందరికీ ఇంగ్లండ్‌ గడ్డపై ఆడిన అనుభవముంది. ఈనెల 25న ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో భారత్‌ తమ తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత 28న కార్డిఫ్‌లో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో భారత్‌ తమ ప్రపంచకప్‌ పోరును మొదలు పెడుతుంది.   

ఫేవరెట్‌ ఇండియానే: మిథాలీ
న్యూఢిల్లీ: ఎక్కువ మంది ‘మ్యాచ్‌ విన్నర్లు’ ఉన్న భారత జట్టే ఈ వరల్డ్‌ కప్‌లో ఫేవరెట్‌ అని భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. ఏ ఒక్కరి గురించో ప్రత్యేకంగా చెప్పడం లేదని, అందరూ జట్టును గెలిపించగల సత్తా ఉన్నవారేనని ఆమె అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో వరల్డ్‌ కప్‌పై మిథాలీ తన అభిప్రాయాలు పంచుకుంది. ‘కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపిస్తుండగా ఓపెనర్లు రోహిత్, ధావన్‌ కీలకం అవుతారు. బుమ్రాలాంటి ఫాస్ట్‌ బౌలర్‌తో పాటు మంచి స్పిన్నర్లు కూడా మన జట్టులో ఉన్నారు. జట్టు భారీ స్కోరు సాధిస్తే మన బౌలింగ్‌తో దానిని కాపాడుకోగలం. చివరి ఆటగాడి వరకు టీమిండియా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ధోని అనుభవం ఎంతో పనికొస్తుంది’ అని ఆమె చెప్పింది. భారత్‌ విజయంపై గట్టి నమ్మకమున్నా... సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్‌ను పక్కన పెట్టలేమని మిథాలీ వ్యాఖ్యానించింది. ఇటీవల అద్భుతంగా వరుస విజయాలతో చెలరేగిపోతున్న ఆతిథ్య దేశానికి కూడా మంచి అవకాశముందని ఆమె పేర్కొంది.    

మరిన్ని వార్తలు