భారత్‌కు ఎదురుందా?

30 Aug, 2019 06:27 IST|Sakshi

తుది అంకానికి చేరిన కరీబియన్‌ పర్యటనలో టీమిండియాను అరుదైన ‘సిరీస్‌ క్లీన్‌స్వీప్‌’ అవకాశం ఊరిస్తోంది. ఇప్పటికే టి20లు, వన్డే సిరీస్‌లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన కోహ్లి సేన... తొలి టెస్టులోనూ గెలుపు ఢంకా గట్టిగానే మోగించింది. రెండో టెస్టుకూ అదే ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. వెస్టిండీస్‌ మాత్రం సొంతగడ్డపై ఆపసోపాలు పడుతోంది. భారత్‌ జోరు కంటే తమ ఆటగాళ్ల ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండటం వారిని కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాను నిలువరించాలంటే హోల్డర్‌ బృందం శక్తికి మించి పోరాడాల్సిందే.  

కింగ్‌స్టన్‌ (జమైకా): తొలి టెస్టులో దక్కిన ఘన విజయం ప్రేరణతో వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది కోహ్లి సేన. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టెస్టుకు ఇక్కడి సబీనా పార్క్‌ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లు మార్పులతో బరిలో దిగే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేసర్‌ షమీని తప్పించి ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది. గాయంతో చివరి నిమిషంలో తొలి టెస్టుకు దూరమైన పేసర్‌ కీమో పాల్‌... కమిన్స్‌ స్థానంలో విండీస్‌ తుది జట్టులోకి వచ్చే వీలుంది. బ్యాట్స్‌మన్‌ షమారా బ్రూక్స్‌ను పక్కనపెట్టి మహాకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌తో అరంగేట్రం చేయించనుంది. 

పంత్‌పై దృష్టి; అశ్విన్‌కు అవకాశం! 
తొలి టెస్టుకు ముందు విపరీతమైన ఒత్తిడిలో ఉన్న వైస్‌ కెప్టెన్‌ రహానే... అర్ధసెంచరీ, సెంచరీతో పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అయితే, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అవసరమైన సమయంలో అతడు క్రీజులో నిలవలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి పంత్‌పై పడింది. అశ్విన్‌కు తుది జట్టులో చోటు కూడా ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టులో అతడిని ఆడించకపోవడం ఆశ్చర్యపర్చినా ఘన విజయం ముందు అదేమీ చర్చనీయాంశం కాలేదు. అశ్విన్‌కు చోటిస్తే పేసర్‌ షమీని తప్పించాల్సి ఉంటుంది. ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ ఫర్వాలేదనిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌ మంచి స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా వైఫల్యం సైతం అనూహ్యమే. కానీ, తన స్థాయి ఆటగాడికి పుంజుకోవడం పెద్ద పనేం కాదు. కోహ్లి, రహానేకు తోడుగా అతడూ రాణిస్తే జట్టు భారీ స్కోరు అందుకుంటుంది. భారత పేస్‌ ధాటిని ఎదుర్కొంటూ విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ నిలవగలదా? అనేది పెద్ద ప్రశ్న. ఇషాంత్‌ కాదంటే బుమ్రా   ప్రత్యర్థికి సింహస్వప్నాల్లా కనిపిస్తున్నారు. స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా పరుగులు చేస్తూ వికెట్లు తీస్తుండటం టీమిండియాను మరింత బలోపేతం చేసింది. 

బ్యాటింగే విండీస్‌ బెంగ... 
బౌలింగ్‌ అంత బలహీనంగా ఏమీ లేకున్నా బ్యాటింగ్‌లో  టాపార్డర్‌ పేలవ ఫామ్‌ వెస్టిండీస్‌ను దెబ్బతీస్తోంది. ప్రత్యర్థి పేసర్లు ఎంత భీకరంగా ఉన్నా, బ్యాట్స్‌మెన్‌ నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడం జట్టును ఆందోళన పరుస్తోంది. నమ్మదగ్గ బ్యాట్స్‌మన్, ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ నిలిస్తేనే ఈ టెస్టులోనైనా వారి పరువు దక్కుతుంది. క్యాంప్‌బెల్‌కు అనుభవం లేదు కాబట్టి బాధ్యతంతా హోప్, చేజ్, హెట్‌మైర్‌లదే. పేసర్‌ రోచ్‌ ఒక్కడికే టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బతీయగల సత్తా ఉంది. గాబ్రియెల్, కీమో పాల్, హోల్డర్‌ తలో చేయి వేస్తే కోహ్లి సేనను కట్టడి చేయగలదు. 

మరొక్క విజయం సాధిస్తే... టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం 27 విజయాలతో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో అతడు సమంగా ఉన్నాడు. 

తుది జట్లు (అంచనా) 

భారత్‌: మయాంక్, రాహుల్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానే, విహారి, పంత్, జడేజా, షమీ/అశ్విన్, ఇషాంత్, బుమ్రా. వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్, బ్రూక్స్‌/కార్న్‌వాల్, హోప్, బ్రేవో, చేజ్, హెట్‌మైర్, హోల్డర్‌ (కెప్టెన్‌), కీమో పాల్, రోచ్, గాబ్రియెల్‌.  
పిచ్‌ పచ్చికతో ఉంది. పేస్‌కు అనుకూలంగా తయారు చేశారు. ఇదే మైదానంలో గతంలో బంగ్లాదేశ్‌పై విండీస్‌ పేసర్లు చెలరేగారు. 20కి 18 వికెట్లు పడగొట్టి మూడు రోజుల్లోనే టెస్టును ముగించేశారు. వాతావరణం మేఘావృతమై ఉన్నా... వర్షానికి అవకాశం తక్కువే. 

మరిన్ని వార్తలు