'వరల్డ్‌ రికార‍్డు'ను సమం చేస్తారా?

1 Dec, 2017 15:57 IST|Sakshi

ఢిల్లీ:శ్రీలంకతో ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో శనివారం ఆరంభమయ్యే చివరిదైన మూడో టెస్టుకు సంబంధించి టీమిండియాను అరుదైన రి​కార్డు ఊరిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ ను టీమిండియా గెలిచినా లేక డ్రా చేసుకున్నా ప్రపంచ రికార్డు సమం కానుంది. ఇప్పటివరకూ టీమిండియా ఎనిమిది సిరీస్‌ల్లో వరుసగా విజయం సాధించి మంచి ఊపుమీద ఉంది. ఢిల్లీ టెస్టులోనూ భారత్‌ ఓటమి చెందకుండా ఉంటే ఆస్ట్రేలియా సాధించిన వరుస సిరీస్ విజయాల రికార్డును సమం చేస్తుంది.  2005-08 మధ్య కాలంలో ఆసీస్‌ వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఇది ఇప్పటి వరకూ వరుస గా అత్యధిక టెస్టు సిరీస్‌ విజయాలు సాధించిన ఘనతగా ఉంది. ఇప‍్పుడు దాన్ని సమం చేసే ఒక సువర్ణావకాశం విరాట్‌ సేన ముందుంది. శ్రీలంకతో తొలి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లి అండ్‌ గ్యాంగ్‌.. రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఇక మూడో టెస్టును విరాట్‌ సేన డ్రా చేసుకుంటే ఆసీస్‌ సరసన నిలుస్తుంది.

2015లో శ్రీలంక పర్యటనతో ఆరంభమైన భారత్ వరుస టెస్టు సిరీస్‌ విజయాలకు ఇప్పటివరకూ బ్రేక్‌ పడలేదు. తాజాగా మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అదే లంకేయులతో చివరి టెస్టులో కూడా భారత్‌ విజయం సాధిస‍్తే సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంటారు. ఒకవేళ డ్రా అయినప్పటికీ 1-0తో సిరీస్‌ భారత్‌ సొంతమవుతుంది.  ఆ క్రమంలోనే వరుసగా  అత్యధిక టెస్టు సిరీస్‌లు సాధించి  ఆసీస్‌ సరసన భారత్‌ చేరుతుంది.  ఏదైనా అద్బుతం జరిగి ఓటమి పాలై సిరీస్‌ డ‍్రాగా ముగిసిన నేపథ్యంలో అరుదైన ఘనతను అందుకుని అవకాశం టీమిండియా చేజారుతుంది. ప్రస్తుతం భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉండటంతో విజయం ఏమాత్రం కష్టం కాకపోవచ్చు.  ఈ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో 2015లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ జట‍్టు 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత ఆరేళ్ల కాలంలో భారత్‌ ఇక‍్కడ ఆడిన మూడు టెస్టుల్లోనూ విజయబావుటా ఎగురవేయడం మరో విశేషం. రేపు ఉదయం గం.9.30 ని.లకు భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు