దక్షిణాఫ్రికా లక్ష్యం 395

5 Oct, 2019 16:54 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 395 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారం నాల్గో రోజు ఆటలో భాగంగా తన రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా 323/4 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. తమ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌కు ఓవరాల్‌గా 394 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా ఈ రోజు ఆటలో దాదాపు అరగంట ఆట మాత్రమే మిగిలి ఉండగా, రేపు(ఆదివారం) ఆఖరి రోజు. దాంతో మ్యాచ్‌పై పట్టుసాధించాలనే ఉద్దేశంతో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. రోహిత్‌ శర్మ(127) సెంచరీ సాధించగా, పుజారా(81) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. రవీంద్ర జడేజా(40), విరాట్‌ కోహ్లి(31 నాటౌట్‌), రహానే(27 నాటౌట్‌)లు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు.

అంతకుముందు 385/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాల్గో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో 46 పరుగులు జోడించిన తర్వాత మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9;31 బంతుల్లో 1ఫోర్‌) తన వంతు పోరాటం చేసి తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చివరి వికెట్‌గా కగిసో రబడా(15) ఔట్‌ కావడంతో సఫారీల ఇన్నింగ్స్‌ ముగిసింది.

మరిన్ని వార్తలు