టీమిండియా అసంతృప్తి.. వెంటనే ఫిర్యాదు!

23 Jan, 2018 17:31 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్ ‌: అసలే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన విరాట్ కోహ్లీ సేన జొహన్నెస్ బర్గ్‌లో జరగనున్న మూడో టెస్టులో విజయం సాధించాలని భావిస్తోంది. 24న వాండరర్స్ మైదానంలో ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. బౌలర్లు భువనేశ్వర్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ కొంతసేపు బౌలింగ్ సాధన చేశారు. అయితే అక్కడే ఉన్న బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రాక్టీస్ పిచ్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు పిచ్ అనుకూలంగా లేదని క్యూరేటర్లకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం నుంచి టీమిండియా కసరత్తులు మొదలుపెట్టగా.. ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన మూడు పిచ్‌లను పరిశీలించిన బంగర్ భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. చీఫ్ క్యూరేటర్ బూటియల్ బూటెలెజితో సమస్యను చర్చించిన రవిశాస్త్రి ప్రాక్టీస్ వికెట్లను మళ్లీ రోలింగ్ చేసి సిద్ధం చేయాలని సూచించారు. రీ రోలింగ్ చేసి ప్రాక్టీస్ పిచ్ మళ్లీ తయారు చేయగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. బంతి బౌన్స్ అవ్వడం లేదని, బ్యాట్‌పైకి కూడా రాకపోవడంతో బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడతారని గమనించి రీ రోలింగ్ చేయమని సూచించినట్లు కోచ్ బృందం వెల్లడించింది.

మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం ఫాస్ట్, బౌన్సీ పిచ్ భారత ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తోందని సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. చీఫ్ క్యూరేటర్ సైతం డుస్లెసిస్ నిర్ణయానికి కట్టుబడి పిచ్ సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరి టెస్టుల్లో నెగ్గి సిరీస్‌ దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాలని కోహ్లీ సేన భావిస్తోంది.

మరిన్ని వార్తలు