కోహ్లి మదిలో ఎవరు?

22 Jun, 2017 01:14 IST|Sakshi
కోహ్లి మదిలో ఎవరు?

కోచ్‌ కోసం మళ్లీ దరఖాస్తులు కోరనున్న బీసీసీఐ   
ముంబై: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ మరోసారి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించనుంది. వాస్తవానికి మే 31తోనే ఈ గడువు ముగిసినా... తాజాగా కుంబ్లే నిష్క్రమణ అనంతరం ఆసక్తిగల వారి నుంచి మళ్లీ అప్లికేషన్‌లు తీసుకుంటే బాగుం టుందని బోర్డు భావిస్తోంది. దరఖాస్తు పంపేందుకు వారం నుంచి పది రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది. ‘మేం ఇంతకు ముందు దరఖాస్తులు తీసుకున్న సమయంలో కుంబ్లే కూడా బరిలో ఉన్నారు. అతని రికార్డు వల్ల మళ్లీ కుంబ్లేనే కొనసాగే అవకాశం ఉందని, పోటీ పడినా ఫలితం లేదని చాలా మంది భావించి ఆగిపోయారు.

 ఇప్పుడు కుంబ్లే లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ సమయంలో మరికొందరు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం సెహ్వాగ్, మూడీ, రాజ్‌పుత్, పైబస్, దొడ్డ గణేశ్‌ దరఖాస్తులు మాత్రమే బీసీసీఐ వద్ద ఉన్నాయి. చాంపియన్స్‌ ట్రోఫీకి వెళ్లే ముందే రవిశాస్త్రి కోచ్‌గా ఉంటే బాగుంటుందంటూ కోహ్లి సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కోహ్లి మాట చెల్లుబాటయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు కుంబ్లే, కోహ్లి విభేదాలకు సంబంధించిన పరిణామాలపై తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రిని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ కోరారు.

మెతకగా ఉండే కోచ్‌ను ఆటగాళ్లు కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్‌ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్‌ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్‌ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్‌ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి.      
 – సునీల్‌  గావస్కర్‌

మరిన్ని వార్తలు