అచ్చొచ్చిన మైదానంలో.. ఇరగదీశారు

18 Sep, 2019 22:41 IST|Sakshi

మరోసారి తన బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన కోహ్లి

తీరుమార్చుకోని పంత్‌

టీ20 సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యం

మొహాలి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్‌ కోహ్లి (72 నాటౌట్‌; 52 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి తన ఫామ్‌ చాటడంతో భారత్‌ సునాయస విజయాన్ని అందుకుంది. సఫారీ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లితో పాటు ధావన్‌(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించాడు. ఛేదనలో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌(12)ను ఫెలుక్‌వాయో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి మరోఓపెనర్‌ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పరిగెత్తించారు. 

కోహ్లి-ధావన్‌లు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అనంతరం షమ్సీ బౌలింగ్‌లో మిల్లర్‌ బౌండరీ వద్ద కళ్లుచెదిరే రీతిలో క్యాచ్‌ అందుకోవడంతో ధావన్‌ భారంగా క్రీజు వదిలాడు. అయితే ధావన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫార్చూన్ బౌలింగ్‌లో పంత్‌(4) పేలవమైన షాట్‌ ఆడి వెనుదిరుగుతాడు. ఈ క్రమంలో శ్రేయాస్‌ అయ్యర్‌(16 నాటౌట్‌)తో కలిసి కోహ్లి టీమిండియాకు విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో ఫెలుక్‌వాయో, ఫార్చూన్, షమ్సీలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. అర్దసెంచరీతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సారథి డికాక్‌ (52; 37 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీతో మెరవగా బవుమా(49; 43 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్‌)తన వంతు పాత్ర పోషించాడు. అయితే  రీజా హెండ్రిక్స్‌(6), మిల్లర్‌(18), డసెన్‌(1) పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ముందు సఫారీ జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. టీమిండియా బౌలర్లలో దీపక్‌ చహర్‌ రెండు వికెట్లతో రాణించగా.. సైనీ, జడేజా, హార్దిక్‌ పాండ్యాలు తలో వికెట్‌ పడగొట్టారు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు