ఆడుకోనిచ్చారు..

1 Dec, 2018 00:45 IST|Sakshi

టీమిండియా బౌలర్లు విఫలం

క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌ 356/6

నలుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధ శతకాలు

ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ అనుభవ లేమిని టీమిండియా బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతగా పేరు లేని వారిని అడ్డుకోలేకపోయారు. రోజంతా బంతులేసినా... పార్ట్‌టైమర్‌ హనుమ విహారితో పాటు ఆఖరికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం రంగంలోకి దిగినా ఆలౌట్‌ చేయలేక పోయారు. ఫలితంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌... భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరును అందుకుంది. అయితే... బుమ్రా, భువనేశ్వర్‌ బౌలింగ్‌కు దిగనందున మనం పూర్తిగా తేలిపోయామనడానికి వీల్లేదు.   

సిడ్నీ: టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్‌నిచ్చిన సన్నాహక మ్యాచ్‌... బౌలర్లకు మాత్రం కొంత కఠినం గానే సాగుతోంది. శుక్రవారమంతా శ్రమించినా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌ ఇన్నింగ్స్‌కు వారు ముగింపు పలకలేకపోయారు. ఓపెనర్లు డీ ఆర్సీ షార్ట్‌ (91 బం తుల్లో 74; 11 ఫోర్లు), మ్యాక్స్‌ బ్రయాంట్‌ (65 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్‌)ల దూకుడైన ఆరంభంతో పాటు వికెట్‌ కీపర్‌ హ్యారీ నీల్సన్‌ (106 బంతుల్లో 56 నాటౌట్‌; 4 ఫోర్లు), అరోన్‌ హార్డీ (121 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో మూడోరోజు ఆట ముగిసే సమ యానికి ప్రత్యర్థి జట్టు 6 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. భారత పేసర్లలో మొహమ్మద్‌ షమీ (3/67) ఫర్వాలేదనిపించగా, ఇషాంత్‌శర్మ (0/57), ఉమేశ్‌ యాదవ్‌ (1/81), జడేజా (0/37) ప్రభావం చూపలేకపోయారు. అశ్విన్‌ (1/63) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 

ముందు వారు... తర్వాత వీరు 
తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించి షార్ట్, బ్రయాంట్‌ సీఏ ఎలెవెన్‌కు శుభారంభమిచ్చారు. ముగ్గురు పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఓవర్‌కు ఆరు రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. అశ్విన్‌ బంతినందుకుని బ్రయాంట్‌ను బౌల్డ్‌ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే షార్ట్‌ను షమీ వెనక్కుపంపాడు. జేక్‌ కార్డర్‌ (38), కెప్టెన్‌ వైట్‌మన్‌ (35) మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే, 21 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు పరమ్‌ ఉప్పల్‌ (5), మెర్లో (3)లను ఔట్‌ చేసిన భారత్‌ పట్టు బిగించినట్లే కనిపించింది. 234/6తో నిలిచిన జట్టును ఏడో వికెట్‌కు అభేద్యంగా 122 పరుగులు జోడించి నీల్సన్, హార్డీ ఆదుకున్నారు. ప్రధాన బౌలర్లు ఈ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోవడంతో హనుమ విహారితో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా బౌలింగ్‌కు దిగాడు. మ్యాచ్‌కు శనివారం ఆఖరి రోజు. సీఏ ఎలెవెన్‌ ఇన్నింగ్స్‌ను ఎంత త్వరగా ముగిస్తే మన బ్యాట్స్‌మెన్‌కు అంత ఎక్కువ ప్రాక్టీస్‌ దొరుకుతుంది.  

లయన్‌తో పోలిక అనవసరం: అశ్విన్‌ 
ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పినర్‌ నాథన్‌ లయన్‌తో తనను పోల్చడం పట్ల భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకింత తీవ్రంగా స్పందించాడు. అశ్విన్‌ కొంతకాలంగా విదేశీ గడ్డపై టెస్టుల్లో విఫలమవుతున్నాడు. ఇదే సమయంలో లయన్‌ ఎక్కడైనా వికెట్లు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ పోల్చి చూడటం తగదని అశ్విన్‌ పేర్కొన్నాడు. తమ ఇద్దరి శైలి మధ్య వైరుధ్యాన్ని చెబుతూనే... దక్షిణాఫ్రికా పేసర్‌ ఫిలాండర్, భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మల బౌలింగ్‌ ఒకేలా ఉండదు కదా? అని ఉదహరించాడు. లయన్, తాను ఒకేసారి కెరీర్‌ ప్రారంభించామని, తమ ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉందని, పరస్పరం గౌరవించుకుంటామని పేర్కొన్నాడు. అతడి నుంచి నేర్చుకునేది ఏముంటుందని ప్రశ్నించాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌ బాగానే సాగిందని వివరించాడు. తొలి టెస్టు సమయానికి తాను గాడిన పడతానని తెలిపాడు. ఆసీస్‌ సిరీస్‌లో పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటాయని భావిస్తున్నానని అన్నాడు. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింట్లోనూ భాగస్వామ్యాలు ముఖ్యమని వివరించాడు. ఆస్ట్రేలియా జట్టు అంతర్గత సమస్యల గురించి తాము ఆలోచించడంలో అర్థం లేదని, తమ జట్టు బలంపైనే దృష్టి పెట్టినట్లు అశ్విన్‌ వెల్లడించాడు.   

మరిన్ని వార్తలు