అప్పుడు రెండొందలు కొడితే బంతి మార్చేవారు..!

2 Nov, 2019 11:20 IST|Sakshi

సిడ్నీ: భారత్ తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్ 22 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు మంచు ప్రభావం చూపే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ ఓ సలహా ఇచ్చాడు. గులాబి బంతి తడిస్తే కొత్తది తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఈ సందర్భంగా డీన్ జోన్స్ మాట్లాడుతూ ..‘డే అండ్‌ నైట్‌ టెస్టు గొప్ప ముందడుగు. మంచు ప్రభావం గురించి తప్పక ఆలోచించాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు.

ఒకవేళ బంతి తడిస్తే కొత్త బంతిని తీసుకోండి. ఆట నిబంధనలు మారుతున్నాయి. ఉదాహరణకు బ్రాడ్‌మన్‌ కాలంలో ఒక జట్టు 200 పరుగులు చేస్తే రెండో కొత్త బంతి ఇచ్చేవారు. మనం రాత్రిపూట ఆడుతున్నాం. ఒకవేళ బంతి తడిస్తే మార్చేయండి. నా దృష్టిలోనైతే ఇది తేలికైన పని. సౌరవ్‌ గంగూలీ టెస్టు క్రికెట్‌తో పాటు రాత్రిపూట క్రికెట్‌కు అభిమాని అని తెలుసు’ అని డీన్‌ జోన్స్‌ వెల్లడించాడు.

‘రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబి టెస్టులదే. ప్రస్తుతం ప్రజలు బిజీగా గడుపుతున్నారు. గులాబి టెస్టులకు ఆస్ట్రేలియాలో రేటింగ్స్‌ బాగున్నాయి. సంప్రదాయ టెస్టులతో పోలిస్తే ఎంత భారీస్థాయిలో ఉన్నాయో చెప్పలేను. బిజీగా ఉండటంతో పగటి పూట టెస్టు క్రికెట్‌ చూడటం జనాలకు కష్టమవుతోంది. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. అలవాటు పడితే సులభంగానే ఉంటుంది’ అని జోన్స్‌ అన్నాడు.(ఇక్కడ చదవండి: ‘పింక్‌ బాల్‌’ ఎందుకు గుచ్చుకుంటోంది! )

>
మరిన్ని వార్తలు