నా బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఓకే.. కానీ

25 Aug, 2019 15:21 IST|Sakshi

ఆంటిగ్వా:  టీమిండియా క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ బాలేదని చాలాకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అనవసరమైన తప్పిదాలతో రాహుల్‌ ఘోర వైఫల్యం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ కేఎల్‌ రాహుల్‌కు జట్టులో పదే పదే చోటివ్వడం ఒక వర్గం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. కోహ్లి ఇష్టమైన ఫెయిల్యూర్‌ ఆటగాడ్ని జట్టులో కొనసాగిస్తున్నారనేది వారి వాదన. అయితే తన బ్యాటింగ్‌తో పాటు టెక్నిక్‌కు సంబంధించి రాహుల్‌ స్పందించాడు.

తన టెక్నిక్‌లో ఎటువంటి లోపం లేదని చెప్పుకొచ్చాడు. కాకపోతే తన స్కోర‍్లను భారీ స్కోర్లుగా మార్చకపోవడం నిరాశ కల్గిస్తుందన్నాడు. ‘ నా బ్యాటింగ్‌ టెక్నిక్‌ అంతా బాగానే ఉంది.  కాకపోతే ఓపిక విషయంలో మెరుగుపడాల్సి వుంది. 35-45 పరుగుల మధ్యలో తరచు ఔట్‌ అవుతున్నా. 60 నుంచి 80 బంతులు ఎదుర్కొన్న క్రమంలో కుదురుగానే ఆడుతున్నా. ఒకవేళ 200-250 బంతుల వరకూ నా బ్యాటింగ్‌ కొనసాగితే  అప్పుడు నాకు, జట్టుకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు దీనిపై దృష్టి సారించాల్సి వుంది’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన రాహుల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు