పతాకధారిగా తేజిందర్‌ పాల్‌

1 Dec, 2019 09:53 IST|Sakshi

నేటి నుంచి దక్షిణాసియా క్రీడలు  

న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బందానికి పతాకధారిగా షాట్‌పుట్‌ క్రీడాకారుడు తేజిందర్‌ సింగ్‌ పాల్‌ తూర్‌ వ్యవహరించనున్నాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో 25 ఏళ్ల తేజిందర్‌ స్వర్ణ పతకం సాధించాడు. దక్షిణాసియా క్రీడలు నేపాల్‌ రాజధాని కఠ్మాండూలో నేడు ప్రారంభమవుతాయి. 10 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు దేశాల నుంచి 2,715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీడాంశాల్లో 1119 పతకాల కోసం క్రీడాకారులు పోటీపడతారు. భారత్‌ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో బరిలో ఉన్నారు.   అథ్లెటిక్స్‌లో భారత్‌ తరఫున 75 మంది బరిలోకి దిగుతున్నారు. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 308 పతకాలు సాధించింది.  

ఫైనల్లో భారత మహిళల జట్టు
వాలీబాల్‌ క్రీడాంశంలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి సెమీఫైనల్లో భారత్‌ 25–14, 25–6, 25–17తో మాల్దీవులు జట్టును ఓడించింది. ఫైనల్లో నేపాల్‌తో భారత్‌ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో నేపాల్‌ 25–14, 25–18, 25–21తో శ్రీలంకపై గెలిచింది. పురుషుల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్‌; పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌ తలపడతాయి.  దక్షిణాసియా క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... కొన్ని క్రీడాంశాల్లో మాత్రం ముందే మ్యాచ్‌లు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు