సింధు సన్నాహాలకు సహకారం

29 Aug, 2019 04:32 IST|Sakshi
సింధును అభినందిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సింధు తల్లి విజయ, క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, కోచ్‌ గోపీచంద్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్‌ భగవత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ

ప్రపంచ చాంపియన్‌కు గవర్నర్‌ అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్‌ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ బుధవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్‌ మెడల్‌ను కేసీఆర్‌కు సింధు చూపించింది.

రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు.

ఒలింపిక్స్‌ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్‌లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌ హామీనిచ్చారు.  ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్‌ భగవత్, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్‌ నరసింహన్‌
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు.

ప్రపంచ  చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్‌ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్‌ ఆకాంక్షించారు.

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్‌కు చూపిస్తున్న మానసి, సింధు  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా