స్విమ్మింగ్‌ శ్యామల

24 Feb, 2020 09:24 IST|Sakshi
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకుంటూ..(ఫైల్‌)

అవకాశం వస్తే ఇంగ్లీష్‌ చానల్‌ ఈదేస్తా

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న స్విమ్మర్‌ గోలి శ్యామల  

గచ్చిబౌలి: ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్‌ కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన. స్విమ్మింగ్‌ చేస్తే బాగుంటుంది కాని నీళ్లంటే ఎక్కడ లేని భయం కదా .. అయినా సరే ఓ సారి చూద్దాం అనుకొని గోలీ శ్యామల నాలుగేళ్ల క్రితం నిజాంపేట్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ వెళ్లింది. దైర్యం చేసి స్విమ్మింగ్‌ శిక్షణ తీసుకుంది. తరువాత ఈత నేర్చుకున్న ఆమె అంతటితో ఆగలేదు. పోటీలలో పాల్గొంటే క్రమం తప్పకుండా సాధన చేయవచ్చని భావించింది. అప్పుడు మొదలైన ఆమె ప్రస్థానం ఇంకా కొనసాగుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ వెటరన్‌ స్విమ్మింగ్‌ పోటీలలో పాల్గొంటూ రాణిస్తున్నారు. ఇండోర్‌ కాకుండా ఓపెన్‌ వాటర్‌ పోటీలలోను రాణిస్తున్నారు. వచ్చే మార్చిలో రామసేతు ఈదేందుకు రెడీ అవుతున్నారు. ఇంగ్లీష్‌ చానల్‌ను ఈదే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

భయంతో మొదలైన సాధన
క్రియేటివ్‌ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, లిటిల్‌ డ్రాగన్‌ యానిమేషన్‌ చిత్రం దర్శకురాలు, రచయిత 47 ఏళ్ల గోలి శ్యామల మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ పోటీలలో రాణిస్తున్నారు. ఈత నేర్చుకునేందుకు 2016లో నిజాంపేట్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత నేర్చుకున్నారు. మూడు నెలల్లోనే జీహెచ్‌ఎంసీ మాస్టర్స్‌ స్టేట్‌ మీట్‌ నిర్వహించగా శ్యామల తృతీయ స్థానంలో నిలిచి పోటీలకు సై అన్నారు. 2020 ఫిబ్రవరి 15న స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓపెన్‌ వాటర్‌ ఒకటిన్నర కిలోమీటర్లు కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. 2020 పిబ్రవరి 21న ఆక్వారేబల్స్‌ వెల్‌ఫేర్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు అనేక పోటీల్లో పాల్గొని పట్టుదలతో రాణించారు. 2018లో గోవాలో జరిగిన మాస్టర్స్‌ నేషనల్‌ పోటీలకు ఎంట్రీ లబించలేదు. నిరుత్సాహపడకుండా ఆ పోటీలకు వాలంటీర్‌గా పని చేసి పోటీలు ముగిసన అనంతరం నిర్వాహకుల సమక్షంలోనే ఆరేబియా సముద్రంలో ఒక కి లోమీటరు ఓపెన్‌ వాటర్‌లో కాంపిటీషన్‌లో పాల్గొన్నారు.

ఫిట్‌నెస్‌కు వయసు అడ్డుకాదు

ఫిట్‌నెస్‌కు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు. నిరంతర సాధనతో ఎవరైనా ఫిట్‌నెస్‌ సాధించవచ్చు.  స్విమ్మింగ్, వాక్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలా ఏదో ఒక క్రీడలో నిత్యం సాధన చేస్తే ఫిట్‌ నెస్‌ సాధించవచ్చు. అన్ని వయస్సుల వారు ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే దేశం కూడా ఆరోగ్యం ఉంటుంది. నేను 43 ఏళ్ల వయస్సులో స్విమ్మింగ్‌ నేర్చుకొని నిరంతరం పోటీలలో పాల్గొనడం, సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించాను. నేటి యువత కూడా శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ సాధించేందుకు నిరతంరం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఒత్తిడిని అదిగమించి మంచి ఫలితాలు సాధించగల్గుతారు. 

మార్చిలో రామసేతుకు  రెడీ
మార్చిలో రామసేతులో 30 కిలో మీటర్లు స్విమ్మింగ్‌ చేసేందుకు సమాయత్తం అవుతున్నాను. ఆ తరువాత అవకాశాలను సమకూర్చుకొని ఇంగ్లీష్‌ చానెల్‌ క్రాస్‌ చేయాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను.  రామసేతును విజయ వంతంగా ఈదేస్తే ఇక ఇంగ్లీష్‌ చానెల్‌ క్రాస్‌ చేసేందుకు ప్రయత్నిస్తా. నా భర్త మోహన్, కుమారుడు విహారి నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. 

ఇవీవిజయాలు..
2019 జనవరిలో విజయవాడలో ఆక్వా డెవిల్స్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణ రివర్‌ స్విమ్మింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించారు.  
2019 జూన్‌లో కర్నాటకలోని తోన్నూరు లేక్‌లో ఐదు కిలోమీటర్ల పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచారు.  
2019 ఆగస్టు 20న సౌతాఫ్రికలోని గ్వాంగ్జులో ఫినా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఓపెన్‌ వాటర్‌లో 3 కిలోమీటర్ల పోటీలో 22వ స్థానంలో నిలిచారు. ఇండియా తరుపున తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి మహిళగా గుర్తింపు పొందింది.  
2019 అక్టోబర్‌లో లక్నోలో మాస్టర్స్‌ నేషనల్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో  తృతీయ స్థానంలో నిలిచారు.  
2019 నవంబర్‌లో పాట్నాలో గంగా నదిలో జరిగిన ఓపెన్‌ కేటగిరీ 13 కిలోమీటర్లు పోటీలో 6వ స్థానంలో నిలిచారు.
2019 డిసెంబర్‌లో కోల్‌కతాలోని హుగ్లీ రివర్‌లో ఓపెన్‌ కేటగిరీలో 14 కిలోమీటర్ల విభాగంలో 7వ ర్యాంక్‌ వచ్చింది. 12 డిగ్రీల చల్లని వాతావరణంలో ఈత పోటీలో పాల్గొన్నారు.  
2019లో గురజాత్‌లోని పోర్‌బందర్‌లో అరేబియా సముద్రంలో ఓపెన్‌ వాటర్‌ 5 కిలోమీటర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించారు.
2020 ఫిబ్రవరి 15న స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓపెన్‌ వాటర్‌ ఒకటిన్నర కిలోమీటర్లు కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు.  
 2020 పిబ్రవరి 2న ఆక్వా డెవిల్స్‌ వెల్‌ఫేర్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు