తెలంగాణకు నాలుగు కాంస్యాలు

1 Nov, 2018 09:58 IST|Sakshi

జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మినీ సబ్‌ జూనియర్, సబ్‌ జూనియర్, జూనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు రాణించాయి. మహారాష్ట్రలోని గురు గోవింద్‌ సింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో జరిగిన ఈ టోర్నీలో నాలుగు కాంస్య పతకాలను సాధించాయి. అండర్‌–19 బాలుర 540 కేజీలు, అండర్‌–17 బాలుర 480 కేజీలు, అండర్‌–17 బాలుర 500 కేజీలు, అండర్‌–15 బాలుర 440 కేజీల విభాగాల్లో తెలంగాణ జట్లు మూడో స్థానంలో నిలిచాయి. మంగళవారం జరిగిన అండర్‌–19 బాలుర ఫైనల్లో కేరళ 2–1తో ఢిల్లీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించింది.

సెమీస్‌లో ఢిల్లీ 3–0తో ఆంధ్రప్రదేశ్‌పై, కేరళ 3–0తో తెలంగాణపై గెలుపొందాయి. అండర్‌–17 బాలుర 480 కేజీల టైటిల్‌పోరులో కేరళ 3–0తో ఢిల్లీపై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో మహారాష్ట్రపై విజయం సాధించింది. 500 కేజీల విభాగంలో ఢిల్లీ, కేరళ తొలి రెండు స్థానాలను దక్కించుకోగా తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణ 3–0తో జమ్ము కశ్మీర్‌ను ఓడించి మూడోస్థానాన్ని అందుకుంది. అండర్‌–15 బాలుర తుదిపోరులో కేరళ 3–0తో ఢిల్లీపై నెగ్గగా... మూడోస్థానం జరిగిన పోరులో తెలంగాణ 3–0తో కర్ణాటకను ఓడించింది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ టగ్‌ ఆఫ్‌ వార్‌ సంఘం అధ్యక్షుడు ఇంద్రసేన్‌ రెడ్డి, ప్యాట్రన్‌ చల్లా భరత్‌ కుమార్‌ రెడ్డి, కార్యదర్శి ఎమ్మాన్యుయేల్‌ పాల్గొన్నారు. కాంస్యాలు సాధించిన తెలంగాణ జట్లను అభినందించారు.   

, ,

మరిన్ని వార్తలు