టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌ తెలంగాణ

9 Mar, 2020 10:03 IST|Sakshi

ఏక్‌ భారత్‌–శ్రేష్ట్‌ భారత్‌ జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఖేలో ఇండియాలో భాగంగా జరిగిన ఏక్‌ భారత్‌–శ్రేష్ట్‌ భారత్‌ జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల తెలంగాణ జట్టు అదరగొట్టింది. ఈ టోర్నీలో హరియాణా జట్టుతో కలిసి బరిలో దిగిన తెలంగాణ టీమ్‌ పురుషుల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా జరిగిన పురుషుల (720 కేజీలు) ఫైనల్లో మహారాష్ట్ర–ఒడిశాపై తెలంగాణ–హరియాణా విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌–అరుణాచల్‌ప్రదేశ్‌–మేఘాలయ జట్టుకు కాంస్య పతకం లభించింది. మహిళల విభాగంలో మాత్రం తెలంగాణ జట్టుకు తుదిపోరులో చుక్కెదురైంది. 

ఇందులోనూ హరియాణాతో జత కట్టిన తెలంగాణ ఫైనల్లో మహారాష్ట్ర–ఒడిశా చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఉత్తరాఖండ్‌–కర్ణాటక జట్టుకు కాంస్య పతకం లభించింది. తెలంగాణ పురుషుల జట్టులో ఎన్‌.రాఘవేందర్‌ (కెప్టెన్‌), ఎ.రాజశేఖర్, పి.విజయ్‌ కుమార్, పి.సుధీర్‌ కుమార్, కె.వివేకానంద, ఎన్‌.మహేందర్‌ ఉండగా... మహిళల జట్టులో డి. సంఘవి (కెప్టెన్‌), కె.త్రిపుజ, జి.మమత, జె.భవాని, జి.మనస్విని, ఎమ్‌.ఉమ ఉన్నారు. పురుషుల జట్టుకు ఎ.భానుప్రకాశ్‌... మహిళల జట్టుకు ఎ.అక్షర కోచ్‌లుగా వ్యవహరించారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి విజేత జట్లకు ట్రోఫీలను, పతకాలను బహూకరించారు.   

>
మరిన్ని వార్తలు