వారియర్స్‌తో ‘టై’టాన్స్‌

13 Aug, 2019 05:57 IST|Sakshi

గెలవాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించిన తెలుగు టైటాన్స్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్‌ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్‌ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్‌లో టైటాన్స్‌కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్‌ దేశాయ్‌ తన రైడ్‌తో పాయింట్‌ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్‌ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్‌ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్‌ను పట్టేయాలని డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది.

అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్‌ దేశాయ్, సూరజ్‌ దేశాయ్‌ల రైడింగ్‌ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్‌ సాధిస్తూ వచ్చిన వారియర్స్‌ టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్‌ స్కోర్‌ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్‌ రైడర్‌ సూరజ్‌ దేశాయ్‌ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. యూపీ రైడర్‌ పవన్‌ శెరావత్‌ అటు రైడింగ్‌లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్‌)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్‌; గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ తలపడతాయి.  

మరిన్ని వార్తలు